శనివారం 06 మార్చి 2021
National - Jan 21, 2021 , 10:11:43

కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!

కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పీఠం రాహుల్‌ గాంధీకే అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ బాధ్యలు తీసుకునేందుకు ఆయన వెనుకంజ వేస్తే పార్టీలోని సీనియర్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. సారథ్య బాధ్యతలను తీసుకునేందుకు ఇప్పటి వరకు రాహుల్ అంగీకరించలేదు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్న అశోక్‌ గెహ్లాట్‌ పేరును ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తోంది. మరో వైపు ఆయన తన మంత్రి వర్గాన్ని విస్తరించే యోచనలో ఉన్నారు. పార్టీ సమావేశం అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం వర్చువల్‌ విధానంలో జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎంపికతో పాటు, సంస్థాగత ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత లోక్‌సభలో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో పార్టీ బాధ్యతల నుంచి రాహుల్‌ గాంధీ తప్పుకున్నారు. దీంతో తాత్కాలిక బాధ్యతలను సోనియాగాంధీకి అప్పగించారు. పలువురు మద్దతుదారులు రాజీనామా వెనక్కి తీసుకొని.. బాధ్యతలు స్వీకరించాలని రాహుల్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినా.. ఇందుకు అంగీకరించలేదు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పలువురు సీనియర్‌ నేతలు పార్టీలో సమూల మార్పులు చేయాలని, కొత్త అధ్యక్షుడిని నియమించాలని, అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సెప్టెంబర్‌లో 23 మంది నేతలు పార్టీ నాయకత్వానికి లేఖాస్త్రం సంధించిన విషయం తెలిసిందే. గత నెలలో లేఖలు రాసిన నేతలతో కాంగ్రెస్‌ అధినేత్రి చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా సీనియర్‌ నేతలు రాహుల్ సిద్ధంగా లేకుంటే, ఒకరిని శాశ్వత అధ్యక్షుడిగా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగుతున్న సోనియా సైతం అనారోగ్య పరిస్థితుల్లో పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేరు. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రత్నామ్నాయంగా సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినాయకత్వం సీనియర్‌ నేత అయిన అశోక్‌ గెహ్లాట్‌ వైపు మొక్కు చూపుతున్నట్లు తెలుస్తోంది. నాటి, నేటి తరం నేతలను మంచి అనుసంధానకర్తగా ఉంటారని పేరుంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్ష పీఠం కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే గత ఏడాది సైతం గెహ్లాట్‌కు పార్టీ బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగినా.. తాను సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేనని అన్నట్లు సమాచారం.

ఇంతకు ముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గెహ్లాట్‌ ఢిల్లీకి వచ్చారు. గత రాజస్థాన్‌ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.  అయితే ఇద్దరు నేతలు బాధ్యతలు తీసుకునేందుకు విముఖ వ్యక్తం చేస్తే బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఎవరన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

VIDEOS

logo