శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 16:19:47

సీఎం రిలీఫ్ ఫండ్‌కు 30 శాతం జీతాల‌ను ఇద్దాం

సీఎం రిలీఫ్ ఫండ్‌కు 30 శాతం జీతాల‌ను ఇద్దాం

భోపాల్ : క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆ రాష్ర్ట సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. కొవిడ్ చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రి నుంచి సీఎం.. మంత్రుల‌తో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క‌రోనాకు వ్య‌తిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు 3 నెల‌ల పాటు 30 శాతం జీతాలు విరాళంగా ఇద్దామ‌ని ఎమ్మెల్యేల‌కు సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ఎమ్మెల్యేలంద‌రూ అంగీక‌రిస్తేనే ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలుపుతాన‌ని సీఎం అన్నారు. ప్ర‌జ‌లు కూడా త‌మ వంతు స‌హ‌కారం అందించాల‌న్నారు. జులై, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 30 శాతం జీతాలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇద్దామ‌ని సీఎం చెప్పారు. 

సీఎం చౌహాన్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన త‌ర్వాత భోపాల్‌లోని చిరాయు ఆస్ప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. రాష్ర్టంలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు, కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి చ‌ర్చిస్తున్నారు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,968కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 8,454 కాగా, ఈ మ‌హ‌మ్మారి నుంచి 21,657 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 857 మంది చ‌నిపోయారు.


logo