గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 11:20:40

ఐఎంఎ పోంజి కుంభకోణం.. ఐఏఎస్‌ అధికారి ఆత్మహత్య

ఐఎంఎ పోంజి కుంభకోణం.. ఐఏఎస్‌ అధికారి ఆత్మహత్య

బెంగళూరు : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎంఎ పోంజి కుంభకోణంలో నిందితుడిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బీఎం విజయ్‌ శంకర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన ఉరేసుకుని మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. రూ. 4 వేల కోట్ల ఐఎంఎ పోంజి కుంభకోణంలో విజయ్‌ శంకర్‌ భారీ మొత్తంలో లంచం తీసుకున్నట్లుగా ఆరోపణ. 2019లో కుమారస్వామి ప్రభుత్వంలో సిట్‌ ఆయనను అరెస్టు చేసింది. అనంతరం కాలంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టాక ఈ కేసును సీబీఐకి అప్పగించింది. శంకర్‌తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను విచారించేందుకు సీబీఐ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరింది.

2013లో పెద్ద మొత్తంలో రిటర్న్స్‌ను ఇస్తామని పేర్కొంటూ మహ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ పోంజి స్కీమ్‌కు తెరలేపాడు. వేలాదిమంది అమాయకుల నుంచి రూ. 4 వేల కోట్లను సేకరించాడు. దీంతో ఆదాయపుపన్ను శాఖ, ఆర్‌బీఐ దృష్టిసారించింది. ఐఎంఏపై విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్‌బీఐ కోరింది. ఈ క్రమంలో కుంభకోణం బయటపడింది. నివేదిక తయారు చేసి రిపోర్ట్‌ సమర్పించవలసిందిగా ప్రభుత్వం విజయ్‌ శంకర్‌ను కోరింది. బెంగళూరు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎల్‌సీ నాగరాజ్‌తో కలిసి నివేదిక తయారీకి ఉపక్రమించాడు.

ఈ క్రమంలో కేసును పక్కదారి పట్టించేందుకు విజయశంకర్‌, నాగరాజ్‌ రూ.1.5 కోట్లను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలపై లంచం ఆరోపణలు చేసి మహ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ దుబాయ్‌కి పారిపోయాడు. గతేడాది జులై 19న ఢిల్లీకి తిరిగి రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఖాన్‌తో పాటు ఐఎంఎ ఇతర ఏడుగురు డైరెక్టర్లను, ఓ కార్పొరేటర్‌తో పాటు పలువురిని ఈ కేసులు పోలీసులు అరెస్టు చేశారు. 


logo