శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 30, 2020 , 02:59:00

రాఫెల్‌ ఫైటర్లు వచ్చేశాయ్‌

రాఫెల్‌ ఫైటర్లు వచ్చేశాయ్‌

  • రాఫెల్‌ ఫైటర్‌ జెట్లు వచ్చేశాయ్‌
  • అంబాలా స్థావరంలో ల్యాండింగ్‌ 
  • సుఖోయ్‌ 30 ఎంకేఐలతో ఘనస్వాగతం
  • భారత సైనిక చరిత్రలో కొత్తశకం మొదలు.. 
  • వాయుసేనలో విప్లవాత్మక మార్పులు: రాజ్‌నాథ్‌ 
  • దేశరక్షణ ధర్మవిధి.. దాన్ని మించింది లేదు: మోదీ 
  • రాఫెల్‌తో దక్షిణాసియాలోనే దుర్బేధ్యంగా వాయుసేన 

దేశ సరిహద్దుల్లో మునుపెన్నడూ లేనంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ.. భారత్‌ విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి సిద్ధమైంది. శత్రువు గుండెలు అదిరేలా కుంభస్థలాన్ని బద్దలు కొట్టగల ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది. శత్రుదేశాలపై గగనతలం నుంచి పిడుగులు కురిపించగల అత్యాధునిక రాఫెల్‌ విమానాలు బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయ్యాయి. దక్షిణాసియాలోనే గేమ్‌చేంజర్‌గా భావిస్తున్న ఈ జెట్‌ ఫైటర్లతో భారత వాయుసేన శత్రు దుర్బేధ్యం కానున్నదని రక్షణరంగ నిపుణులు అంటున్నారు.

అంబాలా, జూలై 29: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ.. దక్షిణాసియాలోనే వైమానికదళాల సామర్థ్యాల లెక్కలను మార్చివేయగల అత్యాధునిక రాఫెల్‌ యుద్ధవిమానాలు భారత్‌లో అడుగుపెట్టాయి. భారత వాయుసేనలో సంబరాలు అంబరాన్నంటిన సమయాన బుధవారం మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో ఐదు రాఫెల్‌ విమానాలు ల్యాండయ్యాయి. భారత సైనిక చరిత్రలో కొత్త శకం మొదలైందంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాఫెల్స్‌కు ఘనస్వాగతం పలికారు. దేశ రక్షణకు మించిన ఉత్కృష్ట ధర్మం మరొకటి లేదని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

సంబరాల స్వాగతం 

మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రాఫెల్‌ ఫైటర్‌ జెట్ల రాకను అంతే వైభవంగా పండుగలా నిర్వహించారు. అంబాలాలో వైమానిక దళంతోపాటు ప్రజలు కూడా కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించగానే రెండు సుఖోయ్‌ 30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఎదురెళ్లి స్వాగతం పలికాయి. ఎయిర్‌ బేస్‌లో రాఫెల్‌ విమానాలు దిగగానే వాటిపైకి జలఫిరంగులతో నీటి ప్రవాహాన్ని పంపించి గౌరవ వందనం చేశారు. ఫ్రాన్స్‌ సముద్రతీర పట్టణం బోర్డియాక్స్‌లోని మెరిగ్నాక్‌ ఎయిర్‌బేస్‌ నుంచి సోమవారం బయలుదేరిన ఈ విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఒకే ఒక్క హాల్ట్‌తో ఏడు వేల కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణించి భారత్‌ చేరాయి. విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించగానే ‘హిందూ మహాసముద్రానికి స్వాగతం.

 మీరు సగర్వంగా ఆకాశాన్ని తాకవచ్చు. హ్యాపీ ల్యాండింగ్‌' అంటూ ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా రేడియో సందేశం పంపింది. దాన్ని స్వీకరించిన రాఫెల్‌ పైలట్లు ధన్యవాదాలు అంటూ సమాధానమిచ్చారు. అధునాతన రాఫెల్‌ యుద్ధ విమానాలు వాయుసేన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుతాయని, యుద్ధ వ్యూహాల్లో కీలక పాత్రను పోషిస్తాయని మాజీ ఐఏఎఫ్‌ చీఫ్‌ ధనోవా ధీమా వ్యక్తం చేశారు. చైనాకు చెందిన చెంగ్డూ జే-20 యుద్ధ విమానాలను సమర్థంగా తిప్పిగొట్టగల సామర్థ్యం రాఫెల్‌, సుఖోయ్‌-30 ఎంకేఐ విమానాలకు ఉన్నదని వివరించారు. చైనా తమ భూతలం నుంచి మన గగనతలంలోని యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చని, ఈ చర్యలను రాఫెల్‌ విమానాలు సమర్థవంతంగా ఎదుర్కోగలవని చెప్పారు.


దేశ రక్షణకు మించిన ధర్మం లేదు 

రాఫెల్‌ యుద్ధవిమానాలకు ప్రధాని నరేంద్రమోదీ సంస్కృతంలో స్వాగతం చెప్పారు. ‘దేశ రక్షణలో భాగం కావటం కంటే గొప్ప వరం లేదు. దేశ రక్షణ ధర్మ విధి, దేశ రక్షణ ఒక యజ్ఞం. అంతకు మించినది ఏదీ లేదు. సగౌరవంగా గగనతలంలోకి ప్రవేశించండి. స్వాగతం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ‘అంబాలాలో పక్షులు (రాఫెల్‌ యుద్ధవిమానాలు) సురక్షితంగా దిగాయి. మనదేశ సైనిక చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. బహుళసామర్థ్యమున్న ఈ యుద్ధవిమానాలు భారత వైమానికదళంలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయి’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. భారత వాయుసేన నూతన శక్తి సామర్థ్యాలను చూసి ఎవరైనా భయపడుతున్నారంటే వాళ్లు భారత భౌగోళిక సమగ్రతకు ముప్పు తేవాలన్న ఆలోచనతో ఉన్నవాళ్లే అంటూ పరోక్షంగా చైనాను రాజ్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.


logo