సోమవారం 06 జూలై 2020
National - Jun 19, 2020 , 14:29:20

చైనాతో ఘర్షణ.. సరిహద్దులకు యుద్ధ విమానాలు

చైనాతో ఘర్షణ.. సరిహద్దులకు యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ: భారత వాయు సేన (ఐఏఎఫ్‌) చీఫ్‌ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ కె ఎస్ భదౌరియా లేహ్‌ ఎయిర్‌బేస్‌ను రహస్యంగా సందర్శించారు. లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భదౌరియా బుధవారం లేహ్‌లోని వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన శ్రీనగర్‌లోని ఎయిర్‌బేస్‌కు గురువారం వెళ్లారు. తూర్పు లఢక్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ రెండు ఎయిర్‌బేస్‌లను భదౌరియా ఆకస్మికంగా సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. 

మరోవైపు చైనాతో ఘర్షణ నేపథ్యంలో పలు యుద్ధ విమానాలను సరిహద్దులకు ఐఏఎఫ్ తరలించింది. సుఖోయ్‌-30ఎంకేఐ, మిరాజ్‌ 2000, జాగ్వార్ యుద్ధ విమానాలను మోహరించింది. తక్కువ సమయంలో వాయు దాడులకు అనుకూలమైన కీలక వైమానిక స్థావరాల్లో వీటిని ఉంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. చైనా సరిహద్దులోని భారత జవాన్లకు అవసరమైన సహాయం కోసం దాడులు చేయగల సామర్థ్యమున్న అపాచీ హెలీకాప్టర్లను కూడా సన్నద్ధంగా ఉంచినట్లు సమాచారం. తూర్పు లఢక్‌ సరిహద్దులోని భారత గగనతలంలోకి  చైనా హెలికాప్టర్లు వచ్చేందుకు ప్రయత్నించగా సుఖోయ్‌-30 యుద్ధ విమానాలను రంగంలోకి దించి వాటిని తరిమినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సరిహద్దులో సుమారు పది వేల మంది సైనికులను చైనా మోహరించింది. logo