గురువారం 21 జనవరి 2021
National - Dec 05, 2020 , 21:18:27

బీజేపీతో పొత్తు ఉంటే సీఎంగానే ఉండేవాడిని: కుమారస్వామి

బీజేపీతో పొత్తు ఉంటే సీఎంగానే ఉండేవాడిని: కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఇంకా సీఎం పదవిలో ఉండేవాడినని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సిద్ధరామయ్యపై శనివారం మండిపడ్డారు. 2006 నుంచి 12 ఏండ్ల పాటు సాధించుకున్న పరపతి కాంగ్రెస్‌తో పొత్తు వల్ల పోయిందని విమర్శించారు. 2006లో బీజేపీతో అధికారం పంచుకునే సమస్య వల్ల సీఎం పదవి నుంచి దిగినప్పటికీ ప్రజల మద్దతు, ఫాలోయింగ్‌ తనకు ఉండేదని అన్నారు. 2018లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తర్వాత సిద్ధరామయ్య, ఆయన బృందం తన కీర్తిని నాశనం చేశారని ఆరోపించారు.

తన తండ్రి దేవెగౌడ వల్లనే కాంగ్రెస్‌ ఉచ్చులో పడ్డానని కుమారస్వామి వాపోయారు. తన తండ్రిని బాధపెట్టడం తనకు ఇష్టం లేదని, సెక్యూలర్‌పై ఆయనకున్న నమ్మకం వల్లనే బీజేపీతో పొత్తుకు నిరాకరించారని చెప్పారు. దీంతో 2018లో కాంగ్రెస్‌తో పొత్తుతో సీఎం పదవిని చేపట్టిన నెల రోజుల్లోనే ఎంతో వేదన అనుభవించాని, కన్నీళ్లను దిగమింగుకున్నానని వాపోయారు. కాగా శనివారం బెలగావి ఎయిర్‌పోర్టులో సీఎం బీఎస్‌ యెడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కలిసి కూర్చొని కనిపించిన తరుణంలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo