మంగళవారం 26 జనవరి 2021
National - Dec 05, 2020 , 06:41:01

రైతుల పక్షాన పోరాటానికి సిద్ధం: ప్రముఖ లాయర్‌ దవే

రైతుల పక్షాన పోరాటానికి సిద్ధం: ప్రముఖ లాయర్‌ దవే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న రైతులకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది దుష్యంత్‌ దవే మద్దతు ప్రకటించారు. తాను రైతుల పక్షాన నిలబడుతానని వెల్లడించారు. రైతులు కోరితే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వారి తరఫుణ కేసులు వాదిస్తానని చెప్పారు. దీనికోసం వారి నుంచి పైసా కూడా తీసుకోనని ఉచితంగానే కేసులు వాదిస్తానని తెలిపారు. దవే నిన్న ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాకు దిగిన రైతులతో సమావేశమయ్యారు. అనంతరం ఈమేరకు ప్రకటన చేశారు. 

కాగా, దుష్యంత్‌ దవే వంటి సీనియర్‌ లాయర్లు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధవుతున్నారని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతుచట్టాలపై పునరాలోచించుకోవాలని న్యాయవాది హెచ్‌ఎస్‌ పుల్కా కోరారు. రైతులకు మద్ధతు ప్రకటించినందుకుగాను ఆయన దవేకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ ఢిల్లీ సరిహద్దుల్లో తొమ్మిది రోజులు చేస్తున్న నిరసనోద్యమ కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఆ చట్టాలను రద్దుచేసేవరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని ప్రకటించారు. ఇవాళ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ చేపట్టాలని నిర్ణయించారు.   


logo