శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 02, 2021 , 21:42:50

మాజీ ప్రధాన్ గ్రామ అధిపతిగా చేశారు: పాక్‌ మహిళ

మాజీ ప్రధాన్ గ్రామ అధిపతిగా చేశారు: పాక్‌ మహిళ

లక్నో: తాను ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదని, మాజీ ప్రధాన్ తనను గ్రామ అధిపతిగా చేశారని పాకిస్థాన్‌ మహిళ బానో బేగం తెలిపారు. దీని గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పారు. సుమారు 35 ఏండ్ల కిందట భారత్‌కు వచ్చిన ఆమె ఉత్తరప్రదేశ్‌ ఎటా జిల్లాలోని గుడౌ గ్రామానికి తాత్కాలిక సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్‌ పౌరసత్వం ఉన్న బానో బేగం ఈ పదవి చేపట్టడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు ఎటా జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్ అలోక్ ప్రియదర్శి తెలిపారు. బానో బేగంను గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామ అధిపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, దీనికి వారు బాధ్యత వహిస్తారని చెప్పారు. భారత జాతీయత కలిగిన వ్యక్తులను మాత్రమే గ్రామ పంచాయతీ అధిపతిగా ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. 

పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన బానో బేగం (65) సుమారు 40 ఏండ్ల కిందట భారత్‌కు వచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ఎటా జిల్లాలోని బంధువుల వద్దకు వచ్చిన ఆమెకు స్థానిక వ్యక్తి అక్తర్ అలీతో పెండ్లి అయ్యింది. పాక్‌ పౌరసత్వం, సుదీర్ఘ కాలం పాసుపోర్టు కలిగిన బానో బేగం నాటి నుంచి ఇక్కడే స్థిరపడ్డారు. భారత పౌరసత్వం కోసం పలుసార్లు దరఖాస్తు చేశారు. 

మరోవైపు ఆధార్‌కార్డుతోపాటు పలు ధ్రువీకరణ పత్రాలను పొందిన బానో బేగం 2015లో గుడౌ గ్రామ వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2020 జనవరి 9న గ్రామ సర్పంచ్‌ షెహ్నాజ్ బేగం మరణించారు. అనంతరం గ్రామ కమిటీ బానో బేగంను తాత్కాలిక సర్పంచ్‌గా ఎన్నుకున్నది. ఈ విషయం తెలిసిన కొందరు స్థానికులు బానో బేగంకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరుపగా ఆమె పాకిస్థాన్‌ జాతీయురాలని తెలిసింది. దీంతో బానో బేగం సర్పంచ్‌ అయ్యేందుకు సహకరించిన వారితోపాటు ఆధార్‌కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను ఆమె ఎలా పొందారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.