శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 21:01:25

నేను ఓడిపోలేదు.. సీటు గెలువలేదు అంతే: ఇమర్తి దేవి

నేను ఓడిపోలేదు.. సీటు గెలువలేదు అంతే: ఇమర్తి దేవి

భోపాల్‌: ఉప ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ఆ స్థానాన్ని మాత్రమే గెలువలేదని మధ్యప్రదేశ్‌లోని దాబ్రా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని ఇమర్తి దేవి అన్నారు. ఈ ఎన్నికల ద్వారా బీజేపీ మరింత పటిష్ఠం కావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. పార్టీకి పూర్తి మెజార్టీ దక్కండంతో సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ మిగతా అధికార కాలాన్ని నిశ్చింతగా పూర్తి చేస్తారని చెప్పారు. దాబ్రాలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేవలం కీలుబొమ్మ అని ఇమర్తిదేవి విమర్శించారు. సమర్థవంతమైన ప్రజా పనులను చేయగలరని తాను భావించడం లేదన్నారు. కరోనా కారణంగా అన్ని నిధులు అయిపోయినందున చేతి పంపునైనా వేయించలేరని, అయితే జీతం మాత్రం పొందుతారంటూ ఆమె ఎద్దేవా చేశారు. 

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో దాబ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇమర్తి దేవి మంగళవారం నాటి ఫలితాల్లో ఓడిపోయారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆమె జ్యోతిరాధిత్య తిరుగుబాటు నేపథ్యంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన 28 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడటంతో వారంతా తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 

అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఆమెను ఐటమ్‌గా అభివర్ణించడం రాజకీయంగా కలకలం రేపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయన స్టార్‌ ప్రచారకర్త హోదాను రద్దు చేసింది. ఈ పరిణామాలతో ఇమర్తిదేవి పేరు దేశవ్యాప్తంగా పాపురల్‌ అయ్యింది. అయితే ఎన్నికల్లో మాత్రం ఆమె ఓడిపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ రాజే 7,633 ఓట్ల మెజార్టీతో ఇమర్తిదేవిపై విజయం సాధించారు. అయినప్పటికీ తాను ఓడిపోలేదని, సీటు మాత్రమే గెలువలేదని ఆమె వ్యాఖ్యానించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.