ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 14, 2020 , 13:07:49

స్వీట్ల‌తోపాటు 130 కోట్ల మంది భార‌తీయుల ప్రేమను తీసుకొచ్చా: ప‌్ర‌ధాని మోదీ

స్వీట్ల‌తోపాటు 130 కోట్ల మంది భార‌తీయుల ప్రేమను తీసుకొచ్చా: ప‌్ర‌ధాని మోదీ

జైపూర్‌: సైనికులతో ఉన్నప్పుడే త‌న‌కు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.  ప్రతి సంవ‌త్స‌రం లాగే ఈసారి కూడా ఆయ‌న‌ దేశ సైనికులతో కలిసి దీపావళి పండుగ‌ జరుపుకున్నారు. ఇవాళ రాజ‌స్థాన్‌లోని జ‌స‌ల్మేర్‌లో సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప్ర‌ధాని దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చానంటూ ప్ర‌ధాని పేర్కొన్నారు. 

మీరు మంచుకొండ‌ల‌పైన‌, ఎడారుల్లో దేశం కోసం శ్రమిస్తున్నారు. మీతో క‌లిసిన త‌ర్వాతే నాకు దీపావ‌ళి పూర్త‌వుతుంది. మీరు ముఖాల్లో సంతోషం చూసిన‌ప్పుడు నా ఆనందం రెట్టింప‌వుతుంది. 130 కోట్ల మంది భారతీయులు మీతో ఉన్నారు. మీ ప‌రాక్ర‌మాన్ని చూసి వారు గ‌ర్వ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచంలోని ఏ శ‌క్తికి కూడా స‌రిహ‌ద్దుల్లో మిమ్మ‌ల్ని ఎదిరించే స‌త్తాలేదు. నేడు భార‌త సైన్యం ఉగ్ర‌వాదుల స్థావ‌రాల్లోకి వెళ్లి వాళ్ల‌ను, వాళ్ల నాయ‌కుల‌ను హ‌త‌మార్చింది. దీంతో భార‌త్ త‌న జోలికి వెళ్తే ఎవ‌రినైనా చిత్తు చేస్తుంద‌నే విష‌యం ప్ర‌పంచానికి తెలిసొచ్చింది అని ప్ర‌ధాని మోదీ సైనికుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

కాగా, న‌రేంద్ర‌మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, 2018లో ఉత్తరాఖండ్‌ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగ జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.