‘రైతులతో చర్చించండి.. అగ్రి చట్టాలు రద్దు చేయండి’

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరుపాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దు సింఘులోని గురు తేజ్ బహదూర్ మెమోరియల్‌ను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఆదివారం సందర్శించారు. అనంతరం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేస్తున్న రైతు సంఘాల నేతలను కలిశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. మన రైతులు గత 32 రోజులుగా చలి మధ్య వీధుల్లో ఎందుకు పడుకోవలసి వస్తున్నదని ప్రశ్నించారు. ఇక్కడ 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తనకు చాలా బాధను కలిగించిందని చెప్పారు. రైతులు చెప్పేది విని వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
మరోవైపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే ప్రయత్నాలు చేయడానికి సీఎం కేజ్రీవాల్ 24 గంటలు కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ స్టేడియంలను జైళ్లుగా మార్చలేదన్నారు. తాము అలా చేసి ఉంటే చరిత్రలో ఒక నల్లని మచ్చగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.