శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 18:35:32

నేను ట్రంప్‌ను కాదు.. ప్రజలు బాధపడుతుంటే చూడలేను: ఉద్ధవ్ ఠాక్రే

నేను ట్రంప్‌ను కాదు.. ప్రజలు బాధపడుతుంటే చూడలేను: ఉద్ధవ్ ఠాక్రే

ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరి వ్యక్తిని తాను కాదని, కరోనా వల్ల ప్రజలు బాధపడుతుంటే చూడలేనని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎలాంటి భయం లేదా ఏ ప్రయోజనాలు ఆశించని విధంగా తన నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలకు ఎదురవుతున్న కష్టాల గురించి తనకు తెలుసని, అయితే కరోనాతో వారు బాధపడటం తాను చూడలేనని అన్నారు. మహారాష్ట్ర ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. శివసేన అధికార ప్రతిక సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవల ఉద్ధవ్ ను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు.

సచివాలయానికి తరచుగా వెళ్లకపోవడంపై వస్తున్న విమర్శలను సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. కరోనా సంక్షోభ సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ఈ నెల 27న 60వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ ఆయనతో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ నెల 25, 26 తేదీల్లో సామ్నాలో ప్రచురితం కానున్నది. దీనికి సంబంధించిన టీజర్ వీడియోను సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ఖాతాలో బుధవారం పోస్టు చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 


logo