ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 22:16:42

ట్రంప్ నిర్ణయంతో మన ఐటీ నిపుణులకు ఇబ్బంది లేదు

ట్రంప్ నిర్ణయంతో మన ఐటీ నిపుణులకు ఇబ్బంది లేదు

వాషింగ్ టన్: అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ సోమవారం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకం చేశారు. దీని వల్ల మన దేశ ఐటీ నిపుణులపై ప్రభావం చూపదా? అంటే మనవారికి అంతగా ఇబ్బంది లేదని చెబుతుంది.  హైదరాబాద్ సాఫ్టువేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్. అమెరికన్లకే ఉద్యోగాలు అనే సిద్ధాంతాన్ని తమ ప్రభుత్వం ఆచరిస్తోందని, తక్కువ వేతనం కోసం లభించే విదేశీ ఉద్యోగి కోసం కష్టపడి పని చేసే అమెరికన్‌ను ఉద్యోగం నుండి తొలగించడాన్ని తాము సహించమని ట్రంప్ సంతకం చేసే సమయంలో చెప్పారు. దీనిపై హైసియా స్పందించింది.

ఫెడరల్ ఏజెన్సీలు హెచ్1బీ వీసా ఉన్నవారిని, విదేశీ కార్మికులను నియమించుకోకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారత ఐటీ నిపుణులకు ఏమాత్రం ఇబ్బంది లేదని హైదరాబాద్ సాఫ్టువేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్యక్షులు, ఇన్ఫోఫీర్స్ సీఈవో భరణి కుమార్ అన్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసాల జారీపై నిషేధం కొనసాగుతోన్నందున పలు కంపెనీలు భారత్‌కు ఔట్ సోర్సింగ్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. దేశంలో లక్షలమంది ఐటీ నిపుణుల్లో 20 శాతం మందికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, ఐవోటీ వంటి డిజిటల్ టెక్నాలజీపై ఎక్కువ అవగాహన ఉందన్నారు. వచ్చే మూడేళ్లలో దేశంలో కనీసం 32 లక్షల మందికి పైగా డిజిటల్ టెక్నాలజీ నిపుణులు అవసరమని భరణి కుమార్ తెలిపారు.

కేంద్రం ప్రైమ్ పేరుతో కొత్త టెక్నాలజీపై శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు. తెలంగాణ టాస్క్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు హెచ్1బీ, ఎల్1 వీసాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నాయని, ఇందులో భాగంగా స్థానికులను ఉద్యోగాల్లో నియమించుకొని, పని మొత్తం భారత్ నుండి నడిచేలా ఔట్ సోర్సింగ్ ఇస్తున్నాయన్నారు. మన దేశంలోనే డిజిటల్ టెక్నాలజీ నిపుణులు తక్కువగా ఉంటే అమెరికాలో మరింత తక్కువగా ఉంటారని, అందుకే మన దేశ ఐటీ నిపుణులకు ఇప్పటికి ఇప్పుడు వచ్చే ఇబ్బంది లేదన్నారు.


logo