ఆదివారం 05 జూలై 2020
National - Jun 13, 2020 , 03:07:40

మన విశ్వం బల్లపరుపు!

మన విశ్వం బల్లపరుపు!

  • 23 ఏండ్ల క్రితమే హైదరాబాద్‌ శాస్త్రవేత్త సిద్ధార్థ ప్రతిపాదన
  • అంతర్జాతీయంగా సమర్థిస్తున్న  పలువురు భౌతిక శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌, జూన్‌ 12: విశ్వం బల్లపరుపుగా ఉంటుంది.. హైదరాబాద్‌ శాస్త్రవేత్త బీజీ సిద్ధార్థ 23 ఏండ్ల క్రితం చేసిన ప్రతిపాదన ఇది. అప్పుడు తన పరిశోధన వివరాలను ‘యూనివర్స్‌ ఆఫ్‌ ఫ్లక్చువేషన్‌' పేరుతో ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ మోడ్రన్‌  ఫిజిక్స్‌లో ప్రచురించారు. డార్క్‌ ఎనర్జీపై తాను చేసిన పరిశోధనలను 1997లో జెరూసలేంలో జరిగిన 7వ మార్సెల్‌ గాస్‌మాన్‌ కాన్ఫరెన్స్‌లో వివరించారు. తర్వాతి ఏడాది క్వాంటం ఫిజిక్స్‌పై సింగపూర్‌లో  జరిగిన ఓ సదస్సులో కూడా తన పరిశోధనలను ముందుంచారు. అప్పుడు ఆయన ప్రతిపాదనలను, పరిశోధనలను, థియరీని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఆ అధ్యయనాన్ని సమర్థిస్తున్న భౌతికశాస్త్ర శాస్త్రవేత్తల సంఖ్య పెరుగుతున్నది. ఇటీవల ఖగోళశాస్త్ర పరిశోధకులు శేషాద్రి నాడాథుర్‌, ఫ్లోరియాన్‌ బ్యూట్లర్‌ ఈ అధ్యయనంపై పరిశోధనా పత్రాలను విడుదల చేస్తూ సిద్ధార్థ ప్రతిపాదనను బలపర్చారు. అంతకుముందు వ్యోమగాములు సాల్‌ పెముట్టర్‌, ఆడమ్‌ రీస్‌ ఇదే అంశంపై జరిపిన పరిశోధనలకు గాను 2011లో వారికి నోబెల్‌ బహుమతి వచ్చింది. దీనిపై ఓ సందర్భంలో సిద్ధార్థ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సంస్థలు పేరు, దేశాన్ని బట్టి శాస్త్రవేత్తల కృషిని గుర్తిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తన పరిశోధనలను పలువురు శాస్త్రవేత్తలు సమర్థించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. బీజీ సిద్ధార్థ ప్రస్తుతం బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన విశ్వానికి సంబంధించిన పరిశోధనలపై పుస్తకాలు కూడా రాశారు.


logo