మంగళవారం 31 మార్చి 2020
National - Mar 12, 2020 , 02:17:01

త్వరలో ఫలక్‌నుమా మెట్రో పనులు

త్వరలో ఫలక్‌నుమా మెట్రో పనులు
  • ఈ మార్గంలోని ప్రభావిత కట్టడాల గుర్తింపు
  • అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు విజయవంతమైందని ఐటీ, పరిశ్రమల, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు నిర్మాణ పనులను త్వరలో చేపడుతామని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అహ్మద్‌ పాషాఖాద్రీ, కేపీ వివేకానంద అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇస్తూ.. ఓల్డ్‌సిటీలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5 కి.మీ. మేర మెట్రోకారిడార్‌ -2 పనుల నిర్వహణ చేపట్టామని తెలిపారు. ఈ మార్గంలో 93 మతపరమైన, సమస్యాత్మక కట్టడాలున్నట్టు పేర్కొన్నారు. వీటిలో 18 నిర్మాణాలు రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్‌తో ప్రభావితం అవుతాయని గుర్తించినట్టు వెల్లడించారు.


ఇంజినీరింగ్‌ పరిష్కారాలతో రక్షించాలని సూచిం చారు. ఇప్పటికే ఫేజ్‌-1 ప్రాజెక్టులోని మిగిలిన పనులన్నీ పూర్తిచేశామని తెలిపారు. హైదరాబాద్‌ మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. దీన్ని విమానాశ్రయం వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో కారిడార్‌ కోసం డీపీఆర్‌ను పరిశీలిస్తున్నామని, దీని అమలు షెడ్యూల్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రూ.14 వేల కోట్లతో చేపట్టిన హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం కేవలం రూ.1200 కోట్లే ఇచ్చిందని తెలిపారు. పాస్‌లు ఇచ్చే విషయంపై మెట్రోరైలు యాజమాన్యంతో మాట్లాడుతామని, రైళ్ల సమయం పెంపుపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో ట్రామ్‌గానీ, బీఆర్టీఎస్‌గానీ.. రెండింటిలో ఏది చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. 20 మల్టీలెవల్‌ పార్కింగ్‌ నిర్మాణాలకు ప్రణాళికలు వేస్తున్నామని కేటీఆర్‌ వివరించారు.


logo
>>>>>>