సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 02:05:41

భారత్‌.. ట్రయల్స్‌

భారత్‌.. ట్రయల్స్‌

హైదరాబాద్‌/చండీగఢ్‌, జూలై 17: కరోనా వ్యాక్సిన్‌ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌పై హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్‌ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్టు ఆ సంస్థ శుక్రవారం వెల్లడించింది. ప్రముఖ దవాఖానల్లో ర్యాండమైజ్డ్‌ , డబుల్‌ బ్లైండ్‌ విధానంలో ప్లాసిబో కంట్రోల్డ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఈ నెల 15నుంచి ప్రారంభమైనట్టు తెలిపింది. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారిపై మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో ట్రయల్స్‌కోసం నమోదు చేసుకున్నవారి పూర్తి ఆరోగ్య పరీక్షల సమాచారాన్ని ఐసీఎమ్మార్‌కు పంపి ంచిన తర్వాతే క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. తెలంగాణలో నిమ్స్‌లో ఇప్పటి వరకు ఇద్దరు క్లినికల్‌ ట్రయల్స్‌కు అర్హులని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కింగ్‌జార్జ్‌ దవాఖానలో ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.

28 రోజులు అబ్జర్వేషన్‌ 

ఈనెల 7 నాటికే క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించాలని ఐసీఎమ్మార్‌ ఆదేశించినా వలంటీర్స్‌ ఎంపిక, ఆరోగ్య పరీక్షల్లో ఆలస్యంతో జాప్యం జరిగింది. మొదటిదశ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిని 28 రోజులపాటు పరీక్షించాల్సి ఉంటుంది. వీరి శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేసి వివరాలను ఐసీఎమ్మార్‌కు పంపాలి. వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్స్‌ ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి రెండో దశలో ఎంతమందిపై ఎక్కడెక్కడ క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాలో నిర్ణయిస్తారు. రెండుదశల్లో హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఐసీఎమ్మార్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కాగా, హర్యానాలోని రోహ్‌తక్‌లో ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ముగ్గురు వ్యక్తులపై కొవాగ్జిన్‌ను శుక్రవారం ప్రయోగించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ట్వీట్‌ చేశారు. 

హ్యూమన్‌ ట్రయల్స్‌ దశలో ఏడు వ్యాక్సిన్లు

దేశంలో ఇప్పటివరకు ఏడు సంస్థలు తయారుచేసిన వ్యాక్సిన్లు హ్యూమన్‌ ట్రయల్స్‌ కోసం ఐసీఎమ్మార్‌నుంచి అనుమతి పొందాయి. అందులో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన కొవాగ్జిన్‌ మొదటిది. ఐసీఎమ్మార్‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. జైడస్‌ కాలిడా సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ కూడా హ్యూమన్‌ ట్రయల్స్‌ కోసం ఐసీఎమ్మార్‌ అనుమతి పొందింది. ఏడు నెలల్లో హ్యూమన్‌ ట్రయల్స్‌ మొత్తం పూర్తిచేస్తామని ఆ సంస్థ చైర్మన్‌ పంకజ్‌ ఆర్‌ పాటిల్‌ శుక్రవారం ప్రకటించారు.


logo