బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 03:21:24

సైన్యంలో భారీ సంస్కరణలు!

సైన్యంలో భారీ సంస్కరణలు!
  • రెండు నుంచి ఐదు థియేటర్‌ కమాండ్స్‌ ఏర్పాటు
  • సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ వెల్లడి

న్యూఢిల్లీ: పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు రెండు నుంచి ఐదు థియేటర్‌ కమాండ్లను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ బలగాల అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌- సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ సోమవారం వెల్లడించారు. 2022నాటికి తొలి థియేటర్‌ కమాండ్‌ అందుబాటులోకి రానుందని తెలిపారు. మిలిటరీలో చేపట్టబోయే భారీ సంస్కరణల ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు. జమ్ము కశ్మీర్‌లో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఒక థియేటర్‌ కమాండ్‌ను నెలకొల్పనున్నట్లు చెప్పారు. నౌకాదళ తూర్పు, పశ్చిమ కమాండ్లను విలీనం చేసి కొత్తగా ‘ద్వీపకల్ప కమాండ్‌'ను ఏర్పాటు చేయనున్నామని, 2021 చివరినాటికి దీనికి ఒక రూపు వచ్చే అవకాశం ఉన్నదని రావత్‌ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను ఈ కమాండ్‌ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రతిపాదిత ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండ్‌ వచ్చే ఏడాది మధ్యనాటికి రూపుదిద్దుకోనుందన్నారు. అమెరికా తరహాలో ప్రత్యేక శిక్షణ కమాండ్‌, అలాగే త్రివిధ దళాల్లో రవాణా తదితర అవసరాలకు కూడా మరో కమాండ్‌ ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నట్లు వివరించారు. 


logo