గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 03:02:18

భూసార కార్డులతో అధికాదాయం

భూసార కార్డులతో  అధికాదాయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భూసార కార్డుల (సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌) వినియోగంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ కార్డుల వినియోగం వల్ల పెట్టుబడి వ్యయం భారీగా తగ్గి, ఉత్పాదకత పెరుగడం వల్ల రైతులకు పంటను బట్టి ఎకరాకు రూ.30,000 వరకు ఆదాయం పెరిగినట్లు తేలింది. జాతీయ ఉత్పాదకత మండలి (ఎన్‌పీసీ) దేశవ్యాప్తంగా 19 రాష్ర్టాల్లోని 76 జిల్లాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. భూసార కార్డుల పంపిణీ పథకాన్ని ప్రారంభించి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా అధ్యయన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. సంబంధిత నేలలో భూసార పరీక్షల అనంతరం ఆ నేల ఏ పంటకు అనువుగా ఉంటుంది, భూసారం పెరుగాలంటే ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలి అన్న వివరాలు భూసార కార్డులో ఉంటాయి. భూసార కార్డులు లేనప్పుడు తాము తగిన మోతాదులో ఎరువులు వాడక పోవడం వల్ల ఉత్పాదకతపై ప్రభావం పడినట్లు రైతులు తెలిపినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. భూసార కార్డుల వినియోగం వల్ల కంది పంటపై ఎకరాకు రూ.25,000-30,000, పత్తిపై 12,000, వరిపై 4,500, బంగాళదుంపపై 3,000 ఆదాయం పెరిగినట్లు తెలిపింది. భూసార కార్డుల్లో సిఫార్సు చేసిన మేరకు ఎరువులను వినియోగించడం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. వరిపై 16-25 శాతం, పప్పులపై 10-15 శాతం, నూనెగింజలపై 10-15 శాతం, పత్తిపై 25 శాతం వ్యయం తగ్గినట్లు తెలిపింది. అలాగే వరి దిగుబడులు 10-20 శాతం పెరుగగా, గోధుమ, జొన్నలు 10-15 శాతం, పప్పులు 10-30 శాతం, నూనె గింజలు 40 శాతం, పత్తి 10-20 శాతం ఉత్పాదకత పెరిగినట్లు వెల్లడించింది. 


logo