మంగళవారం 07 జూలై 2020
National - Jul 01, 2020 , 02:44:29

దేశీ యాప్‌లకు భారీ డిమాండ్‌

దేశీ యాప్‌లకు భారీ డిమాండ్‌

టిక్‌టాక్‌, హేలో, వీగోపై నిషేధంతో..రొపోసో, చింగారీ, ట్రెల్‌వైపు మళ్లిన వినియోగదారులు రాత్రికి రాత్రే లక్షల సంఖ్యలో డౌన్‌లోడ్‌

టిక్‌టాక్‌పై నిషేధం చాలామందిని మరో వేదికవైపు చూసేలా చేసింది. ప్రముఖ టిక్‌టాక్‌ ‘స్టార్లు’ ప్రేమ్‌ వత్స్‌, నూర్‌ అఫ్సాన్‌లు రాత్రికి రాత్రే రొపోసో యాప్‌నకు మారిపోయారు. ప్రేమ్‌ వత్స్‌కు 95 లక్షల మంది, నూర్‌ అఫ్సాన్‌కు 90 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. 

న్యూఢిల్లీ, జూన్‌ 30: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశీయ కంపెనీలకు సిరులు కురిపిస్తున్నది. చైనాకు చెందిన టిక్‌టాక్‌, హేలో, వీగో వంటి వీడియో యాప్స్‌పై నిషేధం విధించడంతో వాటిని పోలిన స్వదేశీ యాప్స్‌కు రాత్రికి రాత్రే భారీగా డిమాండ్‌ పెరిగింది. నిన్నటిదాకా టిక్‌టాక్‌, హేలో యాప్స్‌ను ఉపయోగించిన వినియోగదారులు ‘రొపోసో ’, ‘చింగారీ’, ‘ట్రెల్‌' వంటి దేశీయ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.

12 గంటల్లోనే 6.5 కోట్లు

ప్రభుత్వ నిర్ణయం వెలువడిన 12 గంటల్లోనే తమ యాప్‌ను కోటిమందికిపైగా భారతీయులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ‘రొపోసో’ యాప్‌ సహవ్యవస్థాపకుడు మయాంక్‌ భంగాడియా తెలిపారు. చైనా యాప్‌లపై నిషేధానికి ముందు రొపొసోను 6.5 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, ఇప్పుడు వారి సంఖ్య 10 కోట్లను దాటిందని చెప్పారు. దాదాపు ప్రతి గంటకు ఆరు లక్షలమంది వినియోగదారులు కొత్తగా తమ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని వివరించారు. 

‘ట్రెల్‌' కు ఆదరణ

చాలా తక్కువమందికి తెలిసిన ‘ట్రెల్‌' యాప్‌కు కూడా తాజాగా డిమాండ్‌ పెరిగినట్టు ట్రెల్‌కు చెందిన గూగుల్‌ప్లే పేజ్‌ తెలిపింది. ట్రెల్‌ను ఇప్పటికే 10 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు ఆ పేజ్‌ వెల్లడించింది. ఈ యాప్‌ సామ్‌సంగ్‌ గెలాక్సీ, షియామీ ఎంఐ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది. 

అరగంటకు 2.21 లక్షల వీడియోలు

మునుపెన్నడూలేని రీతిలో మొబైల్‌ యూజర్లు తమ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని చింగారీ యాప్‌ నిర్వాహకులు చెప్పారు. సగటున గంటకు 80వేల మంది చొప్పున తమ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని, ఇప్పటికే తమ వినియోగదారుల సంఖ్య 35 లక్షలు దాటిందని యాప్‌ సహవ్యవస్థాపకుడు, చీఫ్‌ ప్రాడక్ట్‌ అధికారి సుమీత్‌ ఘోష్‌ చెప్పారు. తమ యాప్‌ వేదికగా వినియోగదారులు ప్రతి అరగంటకు 2.21లక్షల వీడియోలను చూస్తున్నారని తెలిపారు. రొపోసో చాలారోజులుగా అందుబాటులో ఉండగా, చింగారీ రెండు రోజుల్లోనే వైరల్‌గా మారింది.

బోలో ఇండ్యా’

లఘు వీడియోల రూపకల్పనకు ఉపయోగపడే మరో ‘బోలో ఇండ్యా’ను కూడా 12 గంటల్లోనే లక్ష మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు తెలిసింది. ఈ యాప్‌ గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌స్టోర్‌తోపాటు ఒప్పొ, వీవో స్మార్ట్‌ఫోన్లకు చెందిన యాప్‌స్టోర్స్‌లో లభ్యమవుతున్నది. logo