మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 02:39:38

ఉత్తరాది పోరుకేక

ఉత్తరాది పోరుకేక

  • మోదీకి రైతుల కాక
  • వ్యవసాయ చట్టాలపై నిరసన దసరా
  • రావణుడి బదులు మోదీ బొమ్మల దహనం
  • పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానాల్లో రైతుల ఉద్యమం 
  • కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు
  • రావణుడి తలల్లో మోదీ, అమిత్‌షా, అంబానీ, అదానీ
  • చట్టాలను రద్దుచేసే దాకా పోరు..
  • పంజాబ్‌ రైతాంగం ప్రతిన5న భారత్‌ బంద్‌కు పిలుపు
  • దసరా వేళ ఎగిసిన జ్వాల

రైతు గుండె రగులుతున్నది. ఉత్తరాది ఉడుకుతున్నది. మోదీ సర్కారు ఏకపక్షంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, బీహార్‌ తదితర రాష్ర్టాలన్నీ ఆగ్రహజ్వాలలు వెదజల్లుతున్నాయి.కాలానికి, కష్టాలకు ఎదురీది సేద్యం చేస్తున్న రైతన్నపై పిడుగుపాటులా...మోదీ తెచ్చిన చట్టాలు...  వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. అందుకే ఈసారి ఉత్తరాదిలో పలుచోట్ల దసరా పండుగ రోజు నిరసనలు వెల్లువెత్తాయి. రావణాసురుడికి బదులు ప్రధాని మోదీ బొమ్మలను పెట్టి... రైతులు రామ్‌లీల నిర్వహించారు. మోదీ, హోంమంత్రి అమిత్‌షా, వ్యవసాయ మంత్రి తోమర్‌, వ్యాపారవేత్తలు అంబానీ, ఆదానీ ఫొటోలతో దశకంఠుడి బొమ్మల్ని తయారుచేసి  పేల్చి, కాల్చివేశారు. మోదీ సర్కార్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలుచేశారు. కర్షకులు, మహిళలు, యువకులు వేలాదిగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ చట్టాలను ఉపసంహరించుకొనేంత వరకు పోరాటం ఆపేది లేదని ప్రకటించిన రైతులు... దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మొదలైన పోరాటం దేశవ్యాప్తమవుతున్నది. అన్నదాత పోరాటానికి అన్నివర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. పండుగలను పక్కకు పెట్టి మరీ రైతులు నిరసనల్లో పాల్గొంటున్నారు. పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా తదితర రాష్ర్టాల్లో నిరసనలు హోరెత్తుతుండగా.. బీహార్‌తోపాటు మరికొన్ని రాష్ర్టాల్లో రైతు ఉద్యమం నివురుగప్పిన నిప్పులా మారింది. ఆదివారం పంజాబ్‌లో రైతులు దసరా పండుగను బహిష్కరించి మరీ పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి రోజంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయంతో నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ చిన్నారుల నుంచి పండు ముసలిదాకా, సాధారణ ఉద్యోగి నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌దాకా.. పల్లె నుంచి పట్నం దాకా అన్నివర్గాల ప్రజలు నిరసనల్లో పాల్గొని అన్నదాతకు మద్దతు తెలిపారు. రైతులను నాశనంచేసే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా రోజున రావణాసురుడిని దహనం చేయడం సంప్రదాయం. కానీ పంజాబ్‌ రైతులు రావణాసురుడికి బదులుగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, నరేంద్రసింగ్‌ తోమర్‌, కార్పొరేట్‌ కంపెనీల అధిపతులు ముకేష్‌ అంబానీ, అదానీ ప్రతిమలను దహనం చేశారు. మోదీని రావణాసురునిగా,  మంత్రి తోమర్‌ను కుంభకర్ణుడిగా, అంబానీ, అదానీలకు మేఘనాథునిగా పేర్లుపెట్టి పటాకులతో పేల్చి దహనం చేశారు.

ప్రసార మాద్యమాలపై మోదీమార్క్‌ కట్టడి

వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌తోపాటు పలు రాష్ర్టాల్లో జరుగుతున్న నిరసనలను ప్రసారం చేయకుండా కేంద్రప్రభుత్వం ప్రసార సాధనాలపై తన మార్క్‌ను చూపెడుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం జాతీయ, స్థానిక వార్తా చానళ్లను నిలువరించిందని ఆరోపిస్తున్నారు. అయితే, సోషల్‌మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కావడంతో కొన్ని చానళ్లు నిరసన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. పంజాబ్‌ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడి రాజీనామా

బీజేపీ అనుబంధ రైతు సంఘమైన భారతీయ కిసాన్‌ మోర్చా (బీకేఎం) పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షుడు తర్లోచన్‌సింగ్‌ గిల్‌ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రైతులను బాధపెట్టిన పార్టీలో పనిచేయడానికి మనస్సాక్షి అంగీకరించడం లేదని తెలిపారు. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలకు నిరసనగా ఉద్యమిస్తున్న రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రైతులు రెండు వారాల పాటు తన ఇంటిముందు ఆందోళన చేశారని, అప్పుడు వారు తన గుండెలపై కూర్చున్నట్టు అనిపించిందని, అప్పుడే తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.  

మద్దతు ధర ఇక మిథ్యే

నూతన వ్యవసాయ చట్టాలతో పంటలకు మద్దతు ధర దక్కడం ఇక మిథ్యేనని వ్యవసాయరంగ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే దేశంలో పలు పంటలకు మద్దతు ధర దక్కడం గగనంగా మారగా.. తాజా చట్టాలతో ఇక ఏ పంటకూ మద్దతు ధర లభించదని అంటున్నారు. ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ర్టాలు మద్దతు ధరను అమలు చేయడం లేదు. స్థానిక వ్యాపారులు వారికి నచ్చిన ధర ఇచ్చి పంటలను కొంటున్నారు. ఇకపై, ఇదే విధానం దేశ వ్యాప్తం కానున్నది. 

కోరలు పీకిన పాములా పౌరసరఫరాలశాఖ

ధరల నియంత్రణ, ధాన్యం మద్దతు ధర అమలు, నిత్యావసర సరుకుల అధిక నిల్వలపై ఆంక్షలతో ఎంతో కీలకంగా వ్యవహరించే పౌరసరఫరాలశాఖ.. కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలతో కోరలు పీకిన పాములా మారిపోయింది. రైతులు, వ్యాపారులు పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు.. కొనుగోలు చేయవచ్చనే వెసులుబాటు ఉండటంతో పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యంతోపాటు ఇతర పంటల దిగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. గతంలో రాష్ట్ర సరిహద్దుల్లో సివిల్‌సైప్లె అధికారులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ర్టాల నుంచి పంట ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వంటి నిత్యావసరాల నిల్వలపై ఉన్న ఆంక్షలను కేంద్రం నూతన చట్టాల ద్వారా ఎత్తివేసింది. దీంతో మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రణలో ఉంచే అధికారం సివిల్‌ సైప్లెకి లేకుండాపోయింది.

వినియోగదారులపై ధరాభారం

పౌరసరఫరాలశాఖకు ఉన్న అధికారాలను నూతన వ్యవసాయ చట్టాల రూపంలో తొలిగించడంతో అంతిమంగా ఆ ప్రభావం వినియోగదారుడిపై పడనున్నది. బడా వ్యాపారులు ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులను కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతారు. తర్వాత మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తారు. అనంతరం అధిక ధరలకు నిల్వ చేసిన సరుకుకు మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఈ విధంగా నూతన చట్టాల వల్ల కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూరుతుండగా వినియోగదారునిపై మాత్రం పెను భారం పడనున్నది.

తెలంగాణ సాహసం చేస్తున్నదా?

తెలంగాణ ప్రభుత్వం ఈసారి కూడా ధాన్యం మొత్తాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇతర ఏ రాష్ట్రం కూడా మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేశాక.. దానిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయని పక్షంలో పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం అసలు ధరకు, మద్దతు ధరకు మధ్య చాలా వ్యత్యాసం ఉండటంతో అటు అన్నదాత కానీ, ఇటు రాష్ర్ట ప్రభుత్వం కానీ నష్టపోవాల్సిందే. రైతు సంక్షేమం కోరే తెలంగాణ ప్రభుత్వానికి రిస్క్‌ తప్పదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మద్దతు ధర చెల్లించే రాష్ర్టాలకు శాపం

మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసే రాష్ట్రాలకు కొత్త వ్యవసాయచట్టాలు పెనుశాపంగా మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దాదాపు అన్ని పంటలను మద్దతు ధరకు కొంటున్నది. దీంతో వ్యాపారులు కచ్చితంగా అదేధర పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త చట్టాలతో పంటల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో వ్యాపారులు తక్కువ ధరకు పంటలు లభించే రాష్ర్టాలవైపే చూస్తారని నిపుణులు చెప్తున్నారు. దీంతో మద్దతు ధర చెల్లించి తీసుకున్న పంట ఉత్పత్తులను తర్వాత కొనేదెవరని పలు రాష్ర్టాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టాల్లో తక్కువ ధరకు ధాన్యం లభించడంతో ఇప్పటికే మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్‌మిల్లర్లు అక్కడి నుంచి భారీ మొత్తంలో దిగుమతి చేసుకున్నారు. ఇక వ్యవసాయ చట్టాలతో గేట్లుబార్లా తెరిస్తే మద్దతు ధర చెల్లించి పంటలను కొనుగోలు చేసే రాష్ర్టాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనున్నదని అంటున్నారు.పండుగనాడూ అట్టుడికిన పంజాబ్‌

దసరా రోజున పంజాబ్‌ వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. కొత్త వ్యవసాయ చట్టాలతో తమ జీవితాలు నాశనమవుతుంటే ఇక పండుగ ఎక్కడిదంటూ రోడ్డెక్కారు. అమృత్‌సర్‌, పాటియాల, గుర్దాస్‌పూర్‌, ఫజిల్‌ ఖా, ఫరీద్‌కోట్‌, జలంధర్‌, మోగ, ముక్తసర్‌ తదితర నగరాల్లో పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. రైతులు నల్ల రంగు దుస్తులు ధరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాము పటాకులు కాల్చుతున్నది పండుగ కోసం కాదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దహనం చేసేందుకేనంటూ ఆందోళనలో పాల్గొన్న రైతులు పెద్ద ఎత్తున నినాదలు చేశారు. పంజాబ్‌లో జరిగిన రైతుల నిరసనలకు రాష్ట్రంలోని అన్నివర్గాలూ మద్దతు తెలిపాయి. పండుగ రోజున పిల్లాపాపలతో ప్రతిఒక్కరూ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం.

ప్రజలంతా రైతుల వెంటే

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు రైతులకు మద్దతునిస్తున్నారు. దసరా సందర్భంగా ఆదివారం పంజాబ్‌లోని 14 జిల్లాల్లో, 42 నగరాలు, పట్టణాల్లో ప్రధాని మోదీ, పలు కార్పొరేట్‌ సంస్థల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమాల్లో పంజాబ్‌, హర్యానాతోపాటు రాజస్థాన్‌కు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, యువజనులు, వృద్ధులు, కార్మికులు, కళాకారులు, రచయితలు మోదీ దిష్టిబొమ్మ దహనాల్లో పాల్గొన్నారు. ఓవైపు వరికోతలు, మరోవైపు గోధుమ పంట సాగు కొనసాగుతున్నప్పటికీ.. కేంద్రానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకీ మరింత ఉద్ధృతమవుతున్నాయి. 

- సుఖ్‌దేవ్‌సింగ్‌, ప్రధానకార్యదర్శి, భారతీయ కిసాన్‌ యూనియన్‌ 

(ఏక్తా ఉగ్రహన్‌) సంస్థ చట్టాలను రద్దుచేస్తేనే విశ్రమిస్తాం

మూడు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనుకకు తీసుకొనేంతవరకు విశ్రమించేది లేదు. ఈ అంశంపై బీజేపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రైతులను దళారులతో పోలుస్తూ అవమానించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేయడానికే మోదీ సర్కార్‌ కంకణం కట్టుకుంది. మద్దతు ధర, మండీ వ్యవస్థ వ్యవసాయ రంగానికి వెన్నెముక వంటివి. ఆ వెన్నెముకను విరగ్గొట్టాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆ మూడు చట్టాలను రద్దుచేసే వరకు రైతులు ఆందోళనను విరమించబోరు.

- జోగిందర్‌సింగ్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహన్‌), అధ్యక్షుడు

బీజేపీలో ఉండటం అర్థంలేనిది..

రైతులను బాధపెట్టిన పార్టీలో పనిచేయడానికి నా మనస్సాక్షి అంగీక రించడం లేదు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు నా సంపూర్ణ మద్దతు. నేను మొదట రైతును, ఆ తరువాతనే రాజకీయ నాయకుడిని. మోదీ ప్రభుత్వం ఆమోదించిన మూడు చట్టాలూ రైతులకు వ్యతిరేకమైనవి. కేంద్రం ఒక్కసారైనా రైతుల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించలేదు. రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న పార్టీలో ఇంకా కొనసాగడంలో అర్థం లేదు.

 తర్లోచన్‌సింగ్‌ గిల్‌, భారతీయ కిసాన్‌ మోర్చా,  పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షుడు