ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 15:57:34

నేడు సర్‌ సీవీ రామన్‌ జయంతి.. ఆయన ప్రత్యేకత ఏంటో తెలుసా?

నేడు సర్‌ సీవీ రామన్‌ జయంతి.. ఆయన ప్రత్యేకత ఏంటో తెలుసా?

హైదరాబాద్‌: సర్‌ సీవీ రామన్‌  ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. ఆయన చేసిన శాస్త్రీయ ప్రయోగాలు, ఆయనకు లభించిన ప్రశంసలు భారతదేశానికే గర్వకారణమయ్యాయి. చాలా చిన్న వయస్సునుంచే రామన్‌ చదువులో రాణించేవారు. అత్యంత చిన్నవయస్సులో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. 1920లో ‘రామన్‌ ఎఫెక్ట్‌’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచంలోనే ప్రఖ్యాత నోబెల్‌ బహుమతిని సొంతం చేసుకున్నారు. 

సర్‌ సీవీ రామన్‌ నవంబర్‌ 7న జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సీవీ రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, ఆయనను భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. 

రామన్‌ ఎఫెక్ట్‌ అంటే..?

 కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు (తేజాణువులు) ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చెదిరిన తేజాణువులలో సింహభాగం వాటి పూర్వపు ఫ్రీక్వెన్సీని కోల్పోవు. కొన్ని మాత్రం కాసింత తక్కువ తరచుదనం (పౌనఃపున్యం)తో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యం సంతరించుకుంటుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయనను నోబెల్‌ వరిచింది. 

సీవీ రామన్‌ ప్రత్యేకతలివే..

  • సీవీ రామన్‌ తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు.
  • తన 11వ ఏట ప్రఖ్యాత మద్రాస్‌ పెసిడెన్సీ కాలేజీలో చేరారు.
  • కాంతి పరిక్షేపణం గురించి ‘రామన్‌ ఎఫెక్ట్‌’ ద్వారా క్షుణ్నంగా వివరించి 1930లో నోబెల్‌ బహుమతి  అందుకున్నారు.
  • ఆయన మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌-అకౌస్టిక్స్‌పైన  శ్రద్ధచూపారు. మృదంగం, తబలా హార్మోనిక్‌ నేచర్‌పై అధ్యయనం చేశారు.
  • 1954లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు.