గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 15:35:19

భారత్ లో ట్యాక్స్ ఎగవేత తో ఎంత నష్టమో తెలుసా...?

భారత్ లో ట్యాక్స్ ఎగవేత తో ఎంత నష్టమో తెలుసా...?

ఢిల్లీ :బహుళ జాతి సంస్థల పన్ను దుర్వినియోగం, ప్రయివేటు వ్యక్తుల ఎగవేత కారణంగా భారత్ ప్రతి ఏటా10.3 బిలియన్ డాలర్ల(రూ.75,000 కోట్లు) మేర పన్ను ఆదాయాన్నినష్టపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. కార్పోరేట్ పన్ను దుర్వినియోగం, ప్రయివేటు పన్ను ఎగవేతల కారణంగా అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు 427 బిలియన్ డాలర్లు (32 లక్షల కోట్లకు పైగా) నష్టపోతున్నట్లు ట్యాక్స్ ది స్టేట్ ఆఫ్ ట్యాక్స్ జస్టిస్ నివేదిక వెల్లడించింది. ఈ నష్టం అన్ని దేశాల్లోని 34 మిలియన్ల నర్సుల వార్షిక వేతనంతో సమానం లేదా ప్రతి సెకనుకు ఒక నర్సు వార్షిక వేతనం నష్టం.

ఈ మేరకు ది స్టేట్ ఆఫ్ ట్యాక్స్ జస్టిస్ 2020 పేరుతో దీనిని విడుదల చేసింది.  పబ్లిక్ సర్వీసెస్ ఇంటర్నేషనల్, గ్లోబల్ అలయెన్స్ ఫర్ ట్యాక్స్ జస్టిస్ వంటి గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్‌‍తో కలిసి ట్యాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ ఈ నివేదికను స్టేట్ ఆఫ్ ట్యాక్స్ జస్టిస్ రిపోర్ట్ పేరుతో తీసుకు వచ్చింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులు, అలాగే, ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలను ఇందులో పేర్కొన్నారు.

భారత్ విషయానికి వస్తే రూ.75వేల కోట్లు లేదా 3 ట్రిలియన్ డాలర్ల దేశ జీడీపీలో 0.41 శాతం మేర నష్టపోతున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఇందులో మల్టీ నేషనల్ కార్పోరేషన్స్ (ఎమ్ఎన్సీ)ల పన్నుల దుర్వినియోగం 10 బిలియన్ డాలర్లు కాగా, ప్రయివేటు ఇండివిడ్యువల్స్ పన్ను ఎగవేత 200 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నష్టపోయే పన్ను వార్షిక హెల్త్ బడ్జెట్‌లో 44.70 శాతం. విద్య కోసం ఖర్చు చేసే ఆదాయంలో 10.68 శాతం.

అలాగే 42.30 లక్షల మందికి నర్సులకు ప్రతి ఏటా ఇచ్చే వేతనంతో సమానం. అలాగే, ఎఫ్‌డీఐల రూపంలో బయటకు అక్రమంగా వెళ్లే నిధులు ఉన్నాయని తెలిపింది. ఇది కూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని పేర్కొంది. బహుళ జాతి కంపెనీలు, వ్యక్తులు పన్ను భారాన్ని తప్పించుకునేందుకు మారిషస్, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాలకు తరలిస్తుంటారని తెలిపింది. భారత్‌ను ఆర్థికంగా దెబ్బతినడానికి ఇది కూడా కారణమవుతుందని అభిప్రాయపడింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.