సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 12:30:03

ఏ సంస్థ లో ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటే?

 ఏ సంస్థ లో ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటే?

బెంగళూరు : కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తున్నాయి. అదేబాటలో  ఐటీ దిగ్గజ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రోలకు చెందిన ఉద్యోగులు ఎక్కువమంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ సహా వివిధ రంగాల్లో అవకాశం ఉన్న అన్ని సంస్థలూ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. భారత దేశం లోని ఇన్ఫర్మేషన్ రంగంలో దాదాపు 50 లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో టాప్5 కంపెనీల్లోనే 11 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 95 శాతానికి పైగా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు.

టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో సంస్థల్లో దాదాపు 11.38 లక్షల ఉద్యోగులు ఉంటారని అంచనా. ఇందులో 10.81 లక్షల మంది ఇంటి నుండి పని చేస్తున్నారని భావిస్తున్నారు. తమ సంస్థలో కేవలం 1 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి వచ్చి పని చేస్తున్నారని టీసీఎస్ ఇటీవల తెలిపింది. 2020 జూన్ క్వార్టర్ ముగిసేనాటికి టీసీఎస్‌లో 4.43 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇందులో కేవలం 4,000 మందికి అటు ఇటుగా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ ఆఫీస్‌ల నుండి వర్క్ చేస్తున్నారు. మిగతా వారు ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వచ్చే క్వార్టర్ ముగిసేనాటికి ఇప్పుడున్న 1 శాతంను 5 శాతానికి పెంచే ప్రయత్నాలు చేస్తామని తెలిపింది.

కరోనా తర్వాత ఉద్యోగులు అందరూ కార్యాలయానికి వచ్చినప్పటికీ ఆ తర్వాత 2025 నాటికి క్రమంగా ఆఫీస్ వర్క్ ఫోర్స్‌ను 25 శాతానికి తగ్గించాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది. వెసులుబాటు కలిగిన మిగతా కంపెనీలు కూడా ఇదే మార్గంలో నడిచే అవకాశాలు లేకపోలేదు. ఇక, ప్రస్తుతం టాప్ 5 టెక్ కంపెనీల్లో 95 శాతం నుంచి 96 శాతం మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డిఓటి) గత వారం టెక్ సంస్థలకు, ఉద్యోగులకు ఊరటనిస్తూ వర్క్ ఫ్రమ్ హోంను డిసెంబర్ 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. టీసీఎస్‌లో 4,43,676 వరకు ఉద్యోగులు ఉండగా ఇందులో 99 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

ఇన్ఫోసిస్‌లో 2,39,233 వరకు ఉద్యోగులు ఉండగా ఇందులో 95 శాతం మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. విప్రోలో 1,81,804 వరకు ఉద్యోగులు ఉన్నారు. టెక్ మహీంద్రలో 1,23,416 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు కంపెనీల్లోను 95 శాతం మంది చొప్పున ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 1,50,287 మంది ఉద్యోగులు ఉండగా 96 శాతం మంది వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు.


  


logo