మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 03:36:06

పైలట్‌ X గెహ్లాట్‌ బిగ్‌ఫైట్‌..!

పైలట్‌ X గెహ్లాట్‌ బిగ్‌ఫైట్‌..!

 • రసకందాయంలో రాజస్థాన్‌ రాజకీయం
 • గంటగంటకూ మారిపోయిన పరిణామాలు
 • సచిన్‌పైలట్‌తో అధిష్ఠానం చర్చలు విఫలం
 • గెహ్లాట్‌ ప్రభుత్వం మైనారిటీలో పడింది 
 • నా వెంట 30 మంది ఎమ్మెల్యేలు: పైలట్‌
 • నేడో రేపో బీజేపీలోకి కాంగ్రెస్‌ యువనేత!
 • ఇదే అదనుగా పావులు కదుపుతున్న బీజేపీ
 • గెహ్లాట్‌కు 106 ఎమ్మెల్యేల మద్దతు: రాజస్థాన్‌ సీఎల్పీ
 • బీజేపీలో చేరేందుకు పైలట్‌ ఎమ్మెల్యేల విముఖత! 
 • యువనేత సొంతపార్టీ పెడుతారంటూ ప్రచారం 
 • సీఎం గెహ్లాట్‌ సన్నిహితులపై ఐటీ దాడులు
 • సంక్షోభానికి బీజేపీయే కారణం: కాంగ్రెస్‌
 • జైపూర్‌లో గెహ్లాట్‌ క్యాంప్‌.. గురుగ్రాంలో పైలట్‌ టీం 

రాజస్థాన్‌ రాజకీయాల్లో బిగ్‌ఫైట్‌ గంటకో మలుపు తిరుగుతున్నది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌పై డిఫ్యూటీ సీఎం, రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్‌ తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం సోమవారం మరింత వేడెక్కింది. శాసనసభా పక్షం సీఎం గెహ్లాట్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించగా, తనవైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సచిన్‌ పైలట్‌ మరోసారి స్పష్టంచేశారు. మంగళవారం మరోసారి సీఎల్పీ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి పైలట్‌ను కాంగ్రెస్‌ ఆహ్వానించినప్పటికీ ఆయన తిరస్కరించారు. కాగా, సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అందువల్లనే యువనేత బీజేపీ తీర్థంపుచ్చుకోవటం ఆలస్యమవుతున్నదని తెలుస్తున్నది. మరోవైపు పైలట్‌ బీజేపీలో చేరటంలేదని, సొంతపార్టీ పెట్టబోతున్నారని ఆయన సన్నిహితవర్గాలు అంటున్నాయి. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి వైదొలగాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్‌ చేసింది. 

జైపూర్‌, జూలై 13: రాజస్థాన్‌లో రాజకీయం గంటకో మలుపు తిరుగుతున్నది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌పై డిఫ్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్‌ తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం సోమవారం మరింత వేడెక్కింది. శాసనసభా పక్షం సీఎం గెహ్లాట్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించగా, తనవైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సచిన్‌ పైలట్‌ మరోసారి స్పష్టంచేశారు. మంగళవారం మరోసారి సీఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని విప్‌ జారీ చేసింది. మరోవైపు ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే అధికారంనుంచి వైదొలగాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్‌ చేసింది. కాగా, సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అందువల్లనే యువనేత బీజేపీ తీర్థంపుచ్చుకోవటం ఆలస్యమవుతున్నదని తెలుస్తున్నది. మరోవైపు పైలట్‌ బీజేపీలో చేరటంలేదని, సొంతపార్టీ పెట్టబోతున్నారని ఆయన సన్నిహత వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా సోమవారం సీఎం గెహ్లాట్‌ సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగటంతో రాజకీయం మరింత వేడెక్కింది. 

సర్కార్‌కు ఢోకా లేదు


కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశాలతో సోమవారం సమావేశమైన సీఎల్పీ.. సీఎం గెహ్లాట్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే ఉన్నారని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని అధిష్ఠానం దూతగా వెళ్లిన రణ్‌దీప్‌ సుర్జేవాలా పరోక్షంగా సచిన్‌పైలట్‌ను హెచ్చరించారు. రాజకీయ సంక్షోభానికి బీజేపీయే కారణమని ఆరోపించారు. బీజేపీ అధిష్ఠానం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నదని విమర్శించారు. సీఎల్పీ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరైంది అధికారికంగా వెల్లడించనప్పటికీ 106 మంది వచ్చారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. కానీ, 84మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనట్టు సమాచారం. సచిన్‌ పైలట్‌తోపాటు ఆయన మద్దతుదారులు ఈ సమావేశానికి హాజరుకాలేదు. గెహ్లాట్‌ మంత్రివర్గ సహచరుడు రమేశ్‌మీనా కూడా పైలట్‌కు మద్దతు ప్రకటించారు. సమావేశం అనంతరం తన గ్రూపు ఎమ్మెల్యేలతో అశోక్‌ గెహ్లాట్‌ జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్‌ హోటల్‌లో క్యాంపు ఏర్పాటుచేశారు. మరోవైపు గెహ్లాట్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఇద్దరు ఎమ్మెల్యే లున్న భారతీయ ట్రైబల్‌ పార్టీ ప్రకటించింది. 

ప్రజలూ నావెంటే: సచిన్‌ పైలట్‌ 

గెహ్లాట్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిందని సచిన్‌ పైలట్‌ చెప్పారు. ‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే కాదు.. రాజస్థాన్‌ ప్రజ లూ నా వెంటే ఉన్నారు’ అని పేర్కొన్నారు. మరోవైపు సచిన్‌వర్గానికి చెందిన ఎమ్మెల్యే ముఖేశ్‌భకర్‌.. తాము కాంగ్రెస్‌ను వీడాలనుకోవడం లేదని, నాయ కత్వ మార్పును మాత్రమే కోరుకుంటున్నా మని చెప్పడం గమనార్హం.  సచిన్‌తో సోనియాతోపాటు రాహుల్‌, ప్రియాంక కూడా సోమవారం మాట్లాడినట్టు వార్తలు వెలువడ్డాయి. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

ఒకటి రెండు రోజుల్లో బీజేపీలోకి పైలట్‌!

కాంగ్రెస్‌ సర్కారు సంక్షోభంపై బీజేపీ రాజకీయ మంత్రాంగాన్ని ముమ్మరం చేసింది. గెహ్లాట్‌ ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందని బీజేపీ రాజస్థాన్‌ అధ్యక్షుడు సతీశ్‌పూనియా అన్నారు. కాంగ్రెస్‌ వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్‌చేశారు. ‘మేం అన్ని మార్గాలను తెరిచే ఉంచాం. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటాం’ అని చెప్పారు. అసెంబ్లీలో గెహ్లాట్‌ వెంటనే బలనిరూపణ చేసుకోవాలని బీజేపీ ఐటీ సెల్‌ అధ్యక్షుడు అమిత్‌మాలవీయ డిమాండ్‌ చేశారు. సచిన్‌ పైలట్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే మాట్లాడినట్టు సమాచారం. ఒకటిరెండు రోజుల్లో నడ్డా సమక్షంలో సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరుతారని తెలుస్తున్నది.

కాంగ్రెస్‌ నేతల వ్యాపారాలపై ఐటీ దాడులు

న్యూఢిల్లీ/జైపూర్‌: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ముదిరిన వేళ.. కాంగ్రెస్‌ నేతల వ్యాపార సంస్థలపై ఆదాయ పన్ను శాఖ సోదాలు జరుపడం చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌కు చెందిన హైడ్రోపవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ, ఇతర వ్యాపార సంస్థలపై నమోదైన పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఢిల్లీ, జైపూర్‌ సహా నాలుగు నగరాల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కాంగ్రెస్‌ నేతల సంస్థలపై సోదాలకు సంబంధించి ఐటీ శాఖ అధికారికంగా స్పందించలేదు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం తమ పార్టీ నేతలు రాజీవ్‌ అరోరా, ధర్మేంద్ర రాథోడ్‌ సంస్థలపై సోదాలు జరిగినట్లు తెలిపాయి. కాగా, రాజకీయం సంక్షోభం తలెత్తిన ప్రస్తుత సమయంలో కాంగ్రెస్‌ నేతలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా విరుచుకుపడ్డారు. ఐటీ, ఈడీ, సీబీఐ.. బీజేపీ శాఖలని ఆరోపించారు. ఈ దాడులతో  ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు.


logo