శుక్రవారం 05 జూన్ 2020
National - May 08, 2020 , 06:29:23

మ‌ద్యం కొన‌డానికి వెళితే వేలికి సిరాచుక్క‌

మ‌ద్యం కొన‌డానికి వెళితే వేలికి సిరాచుక్క‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌:  వేలికి సిరాచుక్క ఎప్పుడు పెడ‌తారంటే అంద‌రూ ట‌క్కున చెప్పే స‌మాధానం ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్పుడ‌ని. ఒక‌సారి పెట్టిన సిరాచుక్క రెండు నుంచి మూడు రోజుల వ‌ర‌కు చెరిగిపోదు కాబ‌ట్టి దొంగ ఓట్లు ప‌డ‌కుండా ద‌శాబ్దాలుగా వేలికి సిరాచుక్క పెడుతున్నారు. కాని ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ జిల్లాలో మ‌ద్యం కొనుగోలుకు వైన్‌షాప్‌కు వచ్చే వారికి ఉప‌యోగిస్తున్నారు. క‌రోనా భ‌యంతో చాలా మంది మ‌ద్యం వ్యాపారులు దుకాణాలు తెర‌వ‌డానికి అంగీక‌రించ‌లేదు. మొద‌టి రోజు వైన్‌షాప్‌లు తీయ‌గానే జ‌నం భారీగా గుమికూడ‌టంతో దుకాణాలు య‌జ‌మానులు భ‌య‌ప‌డ్డారు. తాము షాప్‌లు న‌డ‌ప‌లేమ‌ని ఎక్సైజ్ శాఖ‌కు ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్నారు.

 దీంతో అబ్కారీ శాఖ ఉపాయం ఆలోచించింది. ప్ర‌తి దుకాణం వ‌ద్ద ఒక‌రిని నియ‌మించి మ‌ద్యం కొనుగోలుకు వచ్చేవారి చేతికి సిరాచుక్క పెడుతున్నారు. వారి అడ్ర‌స్‌ను రిజిస్ట‌ర్‌లో న‌మోదు చేస్తున్నారు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌ద్యం షాపుల వ‌ద్ద ర‌ద్దీని నియంత్రిస్తున్నారు. షాప్‌కు ఒక‌సారి వ‌చ్చిన వారు మ‌ళ్లీ రాకుండా సిరిచుక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎవ‌రికైనా క‌రోనా సోకితే షాపుకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రి ఆరోగ్య ప‌రిస్థితిని గ‌మ‌నించే వీలుంటుంద‌ని అధికారులు తెలిపారు. మ‌ద్యంపై మ‌రో 5శాతం ప‌న్ను విధించాల‌ని రాష్ట్రం ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తుంది. వేలుకు సిరాచుక్క పెట్ట‌డంతో జ‌నం భ‌య‌ప‌డుతున్నారు. త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి ల‌భించే స‌బ్సీడీలు, నిత్యావ‌స‌ర స‌రుకులు ఎక్క‌డ ఆగిపోతాయోన‌ని అడ్ర‌స్‌లు ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో కొన్ని ప్ర‌దేశాల్లో గొడ‌వ‌లు కూడా జ‌రుగుతున్నాయి. కొంద‌రైతే ఈ త‌తంగం అంతాచూసి మ‌ద్యం షాపుకు వెళ్ల‌కుండానే వెనుదిరుగుతున్నారు. 


logo