గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 09, 2020 , 03:11:59

ఆప్‌కే సాథ్‌!

ఆప్‌కే సాథ్‌!
  • ఢిల్లీలో మళ్లీ కేజ్రీవాల్‌కే పట్టం?
  • హ్యాట్రిక్‌ ఖాయమన్నఎగ్జిట్‌పోల్స్‌
  • సగటున 55 సీట్లు గెలిచే అవకాశం
  • బీజేపీ రెండోస్థానానికే పరిమితం!
  • కాంగ్రెస్‌ ఖాతా తెరిచే అవకాశాలు తక్కువే
  • ప్రశాంతంగా పోలింగ్‌.. 61.46% ఓటింగ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:ఢిల్లీ ప్రజలు మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీకే పట్టం కట్టే అవకాశాలున్నాయి. దేశ రాజధానిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌ సాధిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిచెప్పాయి. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడిన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని స్పష్టం చేశాయి. లోక్‌సభ ఎన్నికల స్థాయిలో ‘కమల’ బలగాలు మోహరించినా.. ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి కనిపించడం లేదని తెలిపాయి. బీజేపీ రెండో స్థానానికే పరిమితం అవుతుందని పేర్కొన్నాయి. ఇప్పటికే దాదాపు ఉనికిలో లేకుండాపోయిన కాంగ్రెస్‌.. ఈ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపబోదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నా.. ఢిల్లీవాసులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం 61.46 శాతం పోలింగ్‌ నమోదైంది. 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6% పోలింగ్‌ తగ్గింది. మొత్తం 70 నియోజకవర్గాల్లోని 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.


42-68 స్థానాల్లో ఆప్‌ గెలుపు!

తీవ్ర ఆసక్తి కలిగించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ముగియగానే వివిధ మీడియా, సర్వే సంస్థలు తమ అంచనాలను విడుదలచేశాయి. అన్ని సంస్థలు ఏకపక్షంగా ఆమ్‌ఆద్మీ పార్టీదే విజయమని తేల్చిచెప్పాయి. మొత్తం 70 నియోజకవర్గాలకుగానూ ఆ పార్టీ 42 నుంచి 68 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. బీజేపీ రెండో స్థానానికి పరిమితం అవుతుందని ఆ పార్టీ 2-26 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరిచే అవకాశమే లేదని కొన్ని సంస్థలు చెప్పగా, ఒకటోరెండో స్థానాల్లో గెలువొచ్చని మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. 


బీజేపీ విశ్వప్రయత్నాలు చేసినా.. 

ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయం, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ హవా నడుస్తున్న సమయంలోనే.. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. ఈ నేపథ్యంలో ఈసారి భారీగా శ్రమించింది. పదుల సంఖ్యలో కేంద్ర మంత్రులను, వందల సంఖ్యలో ఎంపీలను, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులను రంగంలోకి దించింది. భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా ప్రముఖ నేతల ఇంటింటి ప్రచారంతో హోరెత్తించింది. మరోవైపు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్నవారిపై అనురాగ్‌ ఠాకూర్‌ వంటి కేంద్రమంత్రులు, పర్వేశ్‌ వర్మ వంటి బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.


 ఢిల్లీ పరిధిలో శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. కేంద్రం తలుచుకుంటే షాహీన్‌బాగ్‌ను ఖాళీ చేయించవచ్చు. కానీ.. ఢిల్లీ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడంతోపాటు భయాందోళనలను సృష్టించేందుకు నిరసన శిబిరాన్ని కేంద్రప్రభుత్వం కొనసాగించిందనే విమర్శలు ఉన్నాయి. ‘వాళ్లంతా దేశ ద్రోహులు.. వాళ్లను కాల్చిపారేయండి’, ‘షాహీన్‌ బాగ్‌ ఆందోళనకారులు మీ ఇంట్లోకి చొరబడి ఆడబిడ్డలపై లైంగికదాడులకు పాల్పడొచ్చు’, ‘మేము అధికారంలోకి వస్తే 24 గంటల్లోనే షాహీన్‌బాగ్‌ను ఖాళీ చేస్తాం’ వంటి ప్రకటనలు ఇందులో భాగమేనని విశ్లేషకులు చెప్తున్నారు. ముస్లిమేతరుల ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఏఏకు అనుకూలంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. అయితే ఓటర్ల ముందు ఈ పప్పులేవీ ఉడుకలేదని, కేజ్రీవాల్‌ చేసిచూపించిన అభివృద్ధి, సంక్షేమపథకాలవైపే మొగ్గుచూపారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 


‘బలం’ మారుతున్నది 

ఢిల్లీలో ఆప్‌ విజయం ఖాయమైనా.. 2015తో పోల్చితే బలం మాత్రం తగ్గుతున్నదని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్తున్నాయి. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 67 సీట్లు గెలుచుకోగా, బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదు. శనివారం వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీకి కనిష్ఠంగా 44 సీట్లు, గరిష్ఠంగా 63 సీట్లు కట్టబెట్టాయి. అదేసమయంలో బీజేపీ కనిష్ఠంగా ఐదు స్థానాల్లో, గరిష్ఠంగా 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. దీనిని బట్టి ఆప్‌ గతంతో పోల్చితే కనీసం పది స్థానాల వరకు కోల్పోతుండగా, బీజేపీ అదేస్థాయిలో బలపడే అవకాశం ఉన్నది. ఐదేండ్లు గడిచినా కాంగ్రెస్‌ పరిస్థితి ఏమాత్రం మారేట్టు కనిపించడం లేదు. 2015 ఎన్నికల్లో ఆప్‌ 54.3 శాతం ఓట్లు సాధించగా, బీజేపీకి 32.3 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ 9.7 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నది.  కాగా, ఈసారి పోలింగ్‌ శాతం తక్కువ నమోదైన నేపథ్యంలో ఏ పార్టీ ఓట్లకు గండిపడిందో అన్నది ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో తేలనున్నది. 


ఎగ్జిట్‌పోల్స్‌  అంచనాలు

మీడియా సంస్థ 
ఆప్‌
బీజేపీ+
కాంగ్రెస్‌+
ఇతరులు
టైమ్స్‌నౌ-ఐపీఎస్వోఎస్‌
472300
ఇండియాటుడే-యాక్సిస్‌
59-682-1100
రిపబ్లిక్‌-జన్‌కీబాత్‌
48-619-210-10
న్యూస్‌ఎక్స్‌-నేత 53-57
11-17
0-2
-

ఏబీపీ-సీఓటర్‌
49-63
5-19
0-4
0
న్యూస్‌ఎక్స్‌-పోల్స్‌ట్రాట్‌
50-56
10-14
0
0
ఇండియాటీవీ-ఐపీఎస్వోస్‌
44260-
టీవీ-9 భారత్‌వర్ష్‌-సిసెరో
52-64
6-16
0-
సుదర్శన్‌ న్యూస్‌ 4
422620logo
>>>>>>