శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 08, 2020 , 18:22:55

ఎన్నికల ర్యాలీల కోసం.. కరోనా మార్గదర్శకాల సడలింపు

ఎన్నికల ర్యాలీల కోసం.. కరోనా మార్గదర్శకాల సడలింపు

న్యూఢిల్లీ: ఎన్నికల ర్యాలీల కోసం కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఎన్నికలు జరిగే 12 రాష్ట్రాల్లో రాజకీయ పరమైన ర్యాలీలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 15 వరకు ఎలాంటి ప్రచార ర్యాలీలు నిర్వహించవద్దన్న సెప్టెంబర్‌ 30 నాటి మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం సవరించింది.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, హర్యానా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో 28 స్థానాల ఉప ఎన్నికల కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ, బీహార్‌లో జేడీ(యూ) నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచార ర్యాలీల కోసం కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.

ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలను తక్షణం నిర్వహించుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే కరోనా నియంత్రణ కోసం అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. సెప్టెంబర్‌ 30న జారీ చేసిన మిగతా మార్గదర్శకాలను విధిగా పాటించాలని పేర్కొంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి