బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 02:00:41

ఏ ఒక్కరినీ వదలం

ఏ ఒక్కరినీ వదలం
  • ముందస్తు కుట్రతోనే ఢిల్లీలో హింసాకాండను రగిలించారు
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • లోక్‌సభలో చర్చకు హోంమంత్రి అమిత్‌షా సమాధానం
  • ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ తొలిగింపు

న్యూఢిల్లీ, మార్చి 11: దేశ రాజధాని ఢిల్లీలో హింసాకాండకు కారణమైన వ్యక్తులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని, కులం, మతం, పార్టీలకతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అమాయకులను వేధించబోమని చెప్పారు. ఢిల్లీ అల్లర్లపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ.. కుట్ర పూరితంగా ముందస్తు ప్రణాళిక మేరకే హింసా కాండ జరిగినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. హింసాకాండలో మరణించిన వారి పట్ల విచారం వ్యక్తం చేశారు. హింసాకాండ మొదలైన 36 గంటల్లోనే ఢిల్లీ పోలీసులు వాటిని అదుపులోకి తీసుకొచ్చి, ఇతర ప్రాంతాలకు అల్లర్లు విస్తరించకుండా అడ్డుకున్నారని అమిత్‌ షా చెప్పారు. 


ఢిల్లీ పోలీసుల్లో నైతిక ైస్థెర్యం నింపడానికి తన అభ్యర్థన మేరకే జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ బాధిత ప్రాంతాల్లో పర్యటించారని తెలిపారు. పోలీసుల దృష్టి మళ్లించకుండా ఉండేందుకే తాను అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించలేదన్నారు. ఆయన సమాధానమిస్తుండగానే కాంగ్రెస్‌ పార్టీ వాకౌట్‌ చేసింది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ అల్లర్లపై చర్చ విషయంలో విపక్షానికి సీరియస్‌నెస్‌ లేదని ఎద్దేవా చేశారు. అంతకుముందు లోక్‌సభలో జరిగిన చర్చలో విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార బీజేపీ సభ్యులు మాట్లాడుతూ ఢిల్లీ అల్లర్లను ప్రతిపక్షం సంకుచిత ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు.


‘ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల శాంతిభద్రతల పరిస్థితులు’ అనే అంశంపై కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి చర్చను ప్రారంభిస్తూ మూడు రోజులుగా హింసాకాండ సాగినా ఢిల్లీ పోలీసులు ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నా.. ప్రధాని మోదీ మాత్రం నీరో చక్రవర్తిగా అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో బిజీబిజీగా ఉన్నారని ఆరోపించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో అజిత్‌ దోవల్‌కు బదులు హోంమంత్రి అమిత్‌షా ఎందుకు పర్యటించలేదని నిలదీశారు. ఢిల్లీ అల్లర్లపై రాజ్యసభలో గురువారం చర్చ జరుగనున్నది. 

 

రైల్వేలో తగ్గనున్న సరకు రవాణా చార్జీలు

తూర్పు, పశ్చిమ ప్రాంత పరిధిలో సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్ల విధానాన్ని అమలు చేస్తామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో తెలిపారు. దీంతో లుథియానా నుంచి దన్‌కుని వరకు, దాద్రి నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్ట్‌ వరకు రైళ్లల్లో సరకు రవాణా చార్జీలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.

  • ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను స్పీకర్‌ తొలిగించారు. ఈ మేరకు మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
  • 2016-17 నుంచి 2018-19 మధ్య సైన్యం 1.65 లక్షల మందిని నియమించుకున్నదని రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ తెలిపారు.
  • ఎంపీలాడ్‌ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల నాలుగో తేదీ నాటికి రూ.5,275.24 కోట్లు ఖర్చు కాలేదని కేంద్ర మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ తెలిపారు. 2017 మార్చినాటికి రూ.5,029 కోట్లు, 2018 మార్చినాటికి రూ.4,877 కోట్లు, 2019 మార్చి నాటికి రూ.4,103 కోట్లు ఖర్చు కాలేదన్నారు.


హిందుత్వ విద్వేషపు సునామీ: అసదుద్దీన్‌ ఒవైసీ


ఢిల్లీలో ‘హిందుత్వ విద్వేషపు సునామీ’ విరుచుకుపడిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ హింసాకాండ నుంచి ముస్లింలను సిక్కులు కాపాడారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణకు తాము ప్రాణాలిచ్చేందుకు సిద్ధమన్నారు. అయితే, ఒవైసీ వ్యాఖ్యలపై మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, కిషన్‌ రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. దీంతో ఒవైసీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్లు స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు. 


logo
>>>>>>