సోమవారం 30 మార్చి 2020
National - Mar 13, 2020 , 03:22:55

ఎవరినీ శంకించం!

ఎవరినీ శంకించం!
  • పౌరులను సందేహించేలా ఎన్పీఆర్‌ నవీకరణ ఉండబోదు
  • ఢిల్లీ హింసాకాండ కారకులెవరైనా కఠిన చర్యలు తప్పవు
  • రాజ్యసభలో చర్చకు హోంమంత్రి అమిత్‌షా సమాధానం

న్యూఢిల్లీ, మార్చి 12: జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్‌) నవీకరణ ప్రక్రియలో దేశ పౌరుల ను ఎవరినీ శంకించబోమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఎన్పీఆర్‌ ప్రక్రియలో ఏ పౌరుడిపైనా సందేహస్పద వ్యాఖ్యను రికార్డు చేయబోమని తెలిపారు. ఇందులో భాగంగా పౌరులు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఏ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీలో హింసాకాండపై రాజ్యసభలో గురువారం జరిగిన స్వల్ప కాలిక చర్చకు అమిత్‌షా సమాధానమిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తెచ్చిన నేపథ్యంలో కొందరు చేసిన ద్వేష పూరిత ప్రసంగాలే ఢిల్లీలో హింసకు బీజం వేశాయన్నారు. ఎన్పీఆర్‌ కింద ఏ సమాచారం ఇవ్వాలన్నది ప్రజల ఇష్టమని చెప్పారు. కావాలంటే ఎన్పీఆర్‌పై విపక్ష నేతల సందేహాలను నివృత్తి చేస్తానని అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జరిగిన మత ఘర్షణల్లోనే 76 శాతం మంది మృతి చెందారని, అల్లర్లను ప్రోత్సహించడం బీజేపీ విధానం కాదని చెప్పారు. దేశంలో ట్రంప్‌ పర్యటిస్తున్న వేళ ప్రభుత్వమే హింసాకాండను ఎందుకు ప్రోత్సహిస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీలో విదేశీ కరెన్సీ పంపిణీ అయ్యిందని, ద్వేషాన్ని వ్యాపింపజేసేందుకు ఫిబ్రవరి 24న వేల సోషల్‌ మీడియా ఖాతాలు సృష్టించారన్నారు. ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తాయన్నారు. ఓటర్‌ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల ఆధారంగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా దాడులతో సంబంధం ఉన్న 1992 మందిని గుర్తించామని చెప్పారు. 2647 మందిని అరెస్ట్‌ చేసి, 712 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. ఢిల్లీ హింసాకాండ విషయమై అనుమానితులను గుర్తించేందుకు ఆధార్‌ సమాచారాన్ని వాడలేదని, వ్యక్తిగత గోప్యతా మార్గదర్శకాలను ఉల్లంఘించలేదన్నారు.

న్యాయ విచారణకు ఆదేశించండి

అంతకుముందు చర్చలో పాల్గొన్న విపక్షాల సభ్యులు ఢిల్లీ హింసాకాండపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. హింసాకాండను అడ్డుకోవడంలో జాప్యం చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్‌ సభ్యుడు కపిల్‌ సిబల్‌ చర్చను ప్రారంభిస్తూ విద్వేషపు వైరస్‌ యువతలో వ్యాపిస్తే ప్రజాస్వామ్యం ధ్వంసం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎంకే సభ్యుడు తిరుచి శివ మాట్లాడుతూ హింసాకాండ పట్ల ప్రేక్షకపాత్ర వహించిన ఢిల్లీ పోలీసులను బాధ్యులను చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ సభ్యుడు బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ దాడులను ప్రోత్సహించిన వారిని అరెస్ట్‌ చేసి తగు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా వైరస్‌ కంటే మతతత్వం తక్కువ హానికరమేమీ కాదన్నారు.


logo