సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 16:03:22

మెహబూబా ముఫ్తీని వెంట‌నే విడుదల చేయాలి: రాహుల్ గాంధీ

మెహబూబా ముఫ్తీని వెంట‌నే విడుదల చేయాలి: రాహుల్ గాంధీ

ఢిల్లీ : గృహ నిర్బంధంలో ఉన్న పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ నాయ‌కురాలు మోహ‌బూబా ముఫ్తీని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ కేంద్రాన్ని మ‌రోమారు డిమాండ్ చేశారు. ప్రజా భద్రత చట్టం కింద మెహ‌బూబా ముఫ్తీ దాదాపు సంవ‌త్స‌ర కాలంగా గృహ నిర్బంధంలో ఉన్నారు. జమ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నిర్బంధాన్ని పొడిగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆయ‌న అధ్యక్షుడు ఆరోపించారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం రాజ‌కీయ నాయ‌కుల‌ను అక్ర‌మంగా నిర్బంధంలోకి తీసుకుంటే భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్యం దెబ్బ‌తింటుంద‌న్నారు. నిర్బంధాన్ని ఎత్తివేసి మెహ‌బూబా ముఫ్తీని విడుద‌ల చేయాల‌ని పేర్కొన్నారు.  

శనివారం నాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం స్పందిస్తూ... ప్ర‌జా భ‌ద్ర‌త చ‌ట్టం కింద ముఫ్తీ నిర్బంధాన్ని పొడిగించడం అంటే చట్టాన్ని దుర్వినియోగం చేయడమేన‌న్నారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులపై దాడి చేయ‌డ‌మేనని పేర్కొన్నారు. ముఫ్తీ నిర్బంధాన్ని పొడిగించడం ఇది రెండోసారి. జూలై 31 న జమ్ముక‌శ్మీర్ అధికారులు ముఫ్తీ నిర్బంధాన్ని మ‌రో మూడు నెల‌లు పొడిగించారు. దీనికి ముందు మే 5 న, ఆమె నిర్బంధాన్ని మూడు నెలలు పొడిగించారు. ప్ర‌జా భ‌ద్ర‌త చ‌ట్టం కింద ఒక వ్య‌క్తిని దాదాపు 2 సంవ‌త్స‌రాలు నిర్బంధంలో ఉంచ‌వ‌చ్చు. ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసి ఒక్క రోజు ముందు ముఫ్తీ తోపాటు జమ్ముక‌శ్మీర్‌కు చెందిన మరో 20 మంది నాయకుల‌ను ఆగస్టు 4 నుండి గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. 


logo