మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 17:54:10

అయోధ్య‌లో హై అల‌ర్ట్‌!

అయోధ్య‌లో హై అల‌ర్ట్‌!

అయోధ్య : వ‌చ్చే నెల 5న అయోధ్య రామ‌జ‌న్మ భూమిలో రామ మందిరం భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని ‌భ‌గ్నం చేసి, విధ్వంసం చేసేందుకు ఉగ్ర‌వాదులు కుట్ర ప‌న్నుతున్నార‌న్న కేంద్ర నిఘావ‌ర్గాలు హెచ్చ‌రించ‌డంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆదేశాల‌తో లష్కరే, జైషే మహ్మద్‌ టెర్రరిస్టులు ఈ దాడులకు పాల్పడతారని సమాచారం రావడంతో భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ, అయోధ్య, జమ్మూకాశ్మీర్‌‌లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్‌‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఆగస్టు 5వ తేదీ నాటికి ఏడాది కావ‌డం, అయోధ్య‌లో రామ మందిరానికి శంకుస్థాప‌న చేయ‌డం ఒకే రోజు కావ‌డంతో దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సెక్యూరిటీ పెంచార‌ని అధికారులు పేర్కొన్నారు.

ప్ర‌ధాని హెలీకాప్ట‌ర్ దిగే సాకేత్ మ‌హా విద్యాల‌యం భూమిపూజ స్థ‌లం వ‌ర‌కు భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మోహ‌రించారు. రామ్‌కోట్‌ ప్రాంత నివాసితుల రాకపోకలకు ప్ర‌త్యేకంగా పాస్‌ల‌ను జారీ చేశారు. అలాగే బ‌ల‌గాలు మాక్ డ్రిల్ నిర్వ‌హించ‌డంతో పాటు త‌నిఖీలు చేప‌డుతున్నారు. డ్రోన్ కెమెరాల‌తో నిఘా పెంచారు. కార్య‌క్ర‌మానికి పీఎంతో పాటు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు, ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, ఉమా భార‌తి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు. క‌రోనా నేప‌థ్యంలో 200 మంది అతిథులతో మాత్ర‌మే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. భ‌క్తులంతా ఇళ్ల‌ల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించాల‌ని ఆల‌య ట్ర‌స్ట్ కోరింది.


logo