గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 16:36:26

ట్విట్టర్‌లో మోదీపై రాహుల్‌ చురకలు

ట్విట్టర్‌లో మోదీపై రాహుల్‌ చురకలు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులపై రాహుల్‌ ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోంభానికి సంబంధించి రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. హే.. పీఎంవో ఇండియా.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో మీరు తీరిక లేకుండా ఉండగా, అంతర్జాతీయ చమురు ధరలు 35 శాతం తగ్గడాన్ని మీరు గమనించలేనట్లు ఉందని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ. 60 కన్నా తక్కువకు తగ్గించి భారతీయులకు ఆ లబ్ధిని దయచేసి అందజేయగలరా? స్తంభించిన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ఇది దోహదపడుతుంది అని మోదీని రాహుల్‌ నిలదీశారు. 

మధ్యప్రదేశ్‌లో 15 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే జ్యోతిరాధిత్య సింధియాను తమ పార్టీలో చేర్చుకుంది బీజేపీ. సింధియాకు అనుకూలంగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సింధియా ఇవాళ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. సింధియా జేపీ నడ్డా సమక్షంలో కమలం గూటికి చేరారు. 


logo
>>>>>>