గురువారం 26 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 10:16:14

జమ్మూకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లో భారీగా హిమపాతం

జమ్మూకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లో భారీగా హిమపాతం

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీగా హిమపాతం  కురిసింది. దీంతో చెట్లు, ఇండ్లపై మంచుతో నిండిపోయాయి. మరో వైపు దేశ రాజధాని ఢిల్లీతో సహా హర్యానా, పంజాబ్‌లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కుఫ్రి, మనాలి, ఆలి తదితర పర్యాటక ప్రాంతాలల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన కాశ్మీర్‌లోని కొండలు, రాంబన్‌లోని ముఖ్యమైన జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారి మూతపడింది. అలాగే కుప్వారా, బండిపోరా, బారాముల్లా, గండర్‌బల్‌ నాలుగు జిల్లాలో హిమపాతం హెచ్చరికలు జారీ చేశారు. భారీ మంచువర్షం మధ్య ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలు శీతాకాలం సందర్భంగా మూసివేశారు.  


ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 25.8 డిగ్రీలు

ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమవారం వెస్ట్రన్‌ ఢిల్లీలో 25.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజల్‌లో ఇప్పటి వరకు కనిష్ఠ స్థాయి. పశ్చిమ అవాంతరాల ప్రభావంతో ఇటీవల ఢిల్లీలో వర్షాలు కరిశాయి. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు పెరిగిందని, అక్టోబర్‌ 22 నుంచి అత్యధికంగా ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆకాశం మబ్బులు పట్టి ఉండడం గరిష్ఠ ఉష్ణోగ్రత తగ్గడం, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. ఐఎండీ అంచనా మేరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు శుక్రవారం నాటికి పది డిగ్రీల కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉంది. వర్షాలు తగ్గడంతో గాలి దిశ మళ్లీ వాయువ్య దిశగా మారుతోందని అధికారులు తెలిపారు. కొండ ప్రాంతాల నుంచి చల్లటి గాలులు దేశ రాజధాని వైపు వీస్తాయని ఓ అధికారి తెలిపారు. సోమవారం పంజాబ్‌, హర్యానాలోనూ వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చండీగఢ్‌ సహా పలు ప్రదేశాల్లో వర్షం కురిసింది.    

ముఖ్యమంత్రుల పర్యటన ఆలస్యం


ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, హర్సిల్‌లతో సహా ఎగువ హిమాలయాలు సీజన్‌లో తొలి హిమపాతాన్ని అందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత భారీగా పెరిగింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన హిమపాత్రం సోమవారం ఉదయం వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. భారీ హిమపాతం కేదార్‌నాథ్ ఆలయంలో పూజలకు హాజరైన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, త్రివేంద్ర సింగ్‌ రావత్‌ హాజరయ్యారు. అనంతరం బద్రీనాథ్‌కు వెళ్లాల్సి ఉండగా.. హిమపాతం కారణంగా ఆలస్యమైంది.

పర్యాటక ప్రాంతాలను కప్పేసిన మంచు


హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక ప్రాంతాలైన కుఫ్రి, మనాలిని మంచు కప్పేసింది. కుఫ్రీలో 7 సెంటీమీటర్ల హితమపాతం కురవగా.. కులు జిల్లాలోని మనాలిలో గత 24గంటల్లో 2 సెంటీమీటర్లు కురిసిందని షిమ్లా మీట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. సాంగ్లాలో 25, గోండ్లాలో 20, ఖద్రాలాలో 18, కల్ప 5.6, కీలాంగ్‌లో 4 సెంటీమీటర్ల హిమపాతం పడిందని అలాగే.. రాష్ట్ర రాజధాని షిమ్లాతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లోనూ 21.6 మిల్లీమీటర్ల మంచు వర్షం కురిసిందని చెప్పారు. గిరిజన జిల్లా లాహౌల్‌, స్పితి పరిపాలన కేంద్రం కీలాంగ్‌లో మైనస్‌ 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. పలు చోట్ల సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.  

మంచులో చిక్కుకున్న వారిని రక్షించిన భద్రతా బలగాలు

జమ్మూ కాశ్మీర్‌లో ఎత్తైన సింథన్ పాస్ వద్ద భారీ హిమపాతంలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, చిన్నారులతో సహా పది మందిని భద్రతా దళాలు రక్షించాయి. రక్షణ ప్రతినిధి తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని కిష్త్వార్ జిల్లాను కాశ్మీర్ అనంతనాగ్‌తో కలిపే సింథన్ పాస్ వద్ద చిక్కుకున్న పౌరుల గురించిన సమాచారం వచ్చిన తరువాత ఆదివారం అర్ధరాత్రి సహాయక చర్యలు చేపట్టారు. ఆర్మీ, పోలీస్‌ సిబ్బందితో కూడిన రెస్క్యూ టీం రాత్రి సమయంలో ఎదురుగా ఏమీ కనిపించని పరిస్థితుల్లోనూ ఐదుగంటల పాటు నడిచి వెళ్లి పది మందిని రక్షించి సింథాన్‌కు తరలించి ఆహారం అందించి, ఆశ్రయం కల్పించారు. అలాగే భారీ హిమపాతం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించింది. జవహర్‌ టన్నెల్‌, రాంబన్‌ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ - శ్రీనగర్‌ రహదారి మూసివేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.