‘సాత్వికం’ అంటే ‘సాధు స్వభావం’. ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు చేయక పోవడం. పూర్తి నిరాడంబరత, మాటలలో మాధుర్యతను కనబరచడం. ‘సాత్వికబుద్ధి’ కలిగినవారికి ఎటువంటి భయమూ ఉండదు. ఎందుకంటే, వారికి తమ బుద్ధిశక్తిమీద అపారమైన నమ్మకం ఉంటుంది. కార్యాకార్యాలపట్ల సాత్వికబుద్ధిమంతులకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. వారు ప్రతి దానికీ భయపడరు. ‘దేనికి భయపడాలి? దేనికి భయపడకూడదు?’ అనే దానిపై ఒక పూర్తిస్థాయి స్పష్టత ఉంటుంది. ఏ విషయంలోనైనాసరే వారు తమ వివేచనా శక్తిని ఎప్పటికీ కోల్పోరు.
ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః
యోగేనా వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ॥
‘ధృతి’ అంటే ఒక రకమైన ‘ధైర్యం’ వంటిది. ఏ ధైర్యం వల్ల మనసు ప్రాణేంద్రియ వ్యవహారాలను జరుపుతున్నదో దానికే ‘సాత్విక ధైర్యం’ అని పేరు. మనం సాధింపదలచుకొన్న లక్ష్యం సదా మనసులో చెదరనీయకుండా నిలుప గలిగిన శక్తిని ‘ధృతి’ అంటారు. లక్ష్యసాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యసాహసాలతో వాటిని ఎదుర్కొంటూ, స్థిరంగా నిలుస్తారు. ఇంతటి సాధన చేయగలిగే శక్తి మనకు ‘ధృతి’ ఉన్నప్పుడే కలుగుతుంది. విషయ లంపటంతో, ఇంద్రియ నిగ్రహం లేక, చపలచిత్తం ఉన్నవారిలో ఇలాంటి ‘నిగూఢ శక్తి’ వుండదు. లౌకికంగా ఆలోచిస్తే, లోకంలో ప్రాణాలు అర్పింపగలిగిన ధైర్యశాలులలోనూ, ధర్మసంరక్షణకోసం తమ ధన, మానప్రాణాలనైనా అవలీలగా త్యాగం చేయగలిగిన వారిలోనూ ఇటువంటి ‘ధృతి’ వుంటుంది. త్రికరణశుద్ధిగా దైవాన్ని నమ్మి తమకున్న ఐహిక బంధాలను తొలగించుకొని, కేవలం ‘ఆ దైవమే తమ జీవన సర్వస్వం’ అనుకుని, దైవం కోసమే జీవించేవారే సాధారణంగా ‘ధృతి’ మంతులవుతారు.
మన బుద్ధి నిర్ణయించిన కర్మలు చలించకుండా ఆచరింప చేసుకోడానికి ఎవరికైనా అంతటి ‘ధృతి’ వుండాల్సిందే. వారు బుద్ధి ప్రవృత్తిని అనన్యమైన ఏకాగ్రతతో నిగ్రహించగలిగే ధైర్యాన్ని దీనితోనే సొంతం చేసుకుంటారు. ఇటువంటి ధృతియే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను నిగ్రహించగలుగుతుంది. ఎంతో కాలంగా లౌకిక విషయాల వెనుకకు పరుగెత్తుతున్న ఇంద్రియాలను అదుపులోకి తేగలుగుతుంది. సుదీర్ఘ కాలంపాటు విషయాలను, మనసును భగవత్తత్త్వం మీద నిలుపగలగాలి. ఇదొక రకంగా చాలా కష్టసాధ్యమైన పనే. కానీ, సంకల్పం, స్థిరకాంక్ష వుండే ప్రతి మానవునికీ అసాధ్యం మాత్రం కాదు. నిరాశకు లోనుకాకుండా అకుంఠిత సాధనద్వారా దాన్ని సాధించాలనుకునేవారికి మౌలికంగా ‘యోగం’ చాలా అవసరం. ఆత్మధ్యానం ద్వారా మనసు స్థయిర్యాన్ని, శాంతిని, సుఖసంతోషాలను పొందగలుగుతుంది. అప్పుడు మనసు మన ఇంద్రియాలపై ఆధిపత్యం వహిస్తుంది. మనసు సాధించే అటువంటి శక్తినే ‘ధృతి’గా చెప్పాలి. దీని సహాయంతోనే సాధకుడు తన లక్ష్యాన్ని అవలీలగా చేరుకోగలుగుతాడు. ఇంతటి శ్రద్ధ, పరిశ్రమ, ఏకాగ్రతలతో కూడిన ధృతి ‘సాత్విక ధృతి’గా ఎదుగుతుంది.
‘సాత్విక ధృతి’ అనేది వ్యక్తి అలవర్చుకుంటేనే వచ్చేది. ఇంత గొప్ప సలక్షణం కలిగినవారు లోకంలో చాలా అరుదు. సాత్వికం, ధృతి రెండిటి కలయిక ప్రతి మనిషికీ తప్పనిసరి. ఈ రెండిటిలో ఏది లోపించినా ఆధ్యాత్మిక సాధనా సంపత్తి కష్టమే. ‘సాత్వికం’ అనేది నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యక్తి స్వతహాగా ఏర్పరచుకున్నది. ‘ధృతి’ అలా కాదు. ఇదొక రకంగా ధైర్య, సాహసాలు, స్థిరచిత్తానికి సంబంధించిన విషయం. రెండిటి కలయికతో ‘సాత్విక ధృతి’ని అలవర్చుకున్న వ్యక్తులలో లాభాపేక్ష, క్రూరత్వం అన్నవి మంచుకైనా ఉండవు. ఇతరులకు పరోపకారం చేయాలనే చిత్తశుద్ధిని మాత్రమే వారు నిరంతరం కలిగిఉంటారు. ఇదే వారికి పెట్టని ఆభరణం వలె నిలుస్తుంది.
కనుమ ఎల్లారెడ్డి
93915 23027