ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 16, 2020 , 17:47:35

తెలంగాణ‌లో మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు‌

తెలంగాణ‌లో మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు‌

హైద‌రాబాద్‌: తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బుధ‌వారం మ‌రింత‌ బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతున్న‌ది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది దక్షిణ దిశ వైపున‌కు వంపు తిరిగి ఉన్నది. ఇక ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సుమారుగా సెప్టెంబర్‌ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న‌ది. దాంతో రాగల మూడురోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉన్న‌ది.

ఆదిలాబాద్, కుమ్రం భీం -ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మ‌హ‌బూబ్‌నగర్, నాగర్‌క‌ర్నూల్‌, నల్ల‌గొండ‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo