ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 21:13:21

మహారాష్ట్రలో జోరుగా వానలు

మహారాష్ట్రలో జోరుగా వానలు

ముంబై : మహారాష్ట్రలో గత రెండు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలోని హిండ్‌మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సియాన్ వంటి పలు ప్రాంతాలు అడుగు నుంచి రెండడుగుల వరకు నీరు నిలిచిపోయింది. శాంతాక్రుజ్, గొరెగావ్, మలద్, కాండివలి, బోరివలి, ఇతర పశ్చిమ ప్రాంత శివార్లలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి.

మరోవైపు రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. థానే, రత్నగిరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పాల్ఘర్, ముంబై, తానే, రాయిగఢ్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా తెలిపింది. తులే జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. వాహనాల ప్రయాణానికి అవకాశం లేకపోయినప్పటికీ జనం బయటికి వస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు.

శనివారం ఉదయం నుంచి ముంబై శివార్లు, థానేలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబైలో ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ 66 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు కొలబా వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా, శాంతాక్రుజ్ వాతావరణ కేంద్రం 111.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. ప్రజలు తీర ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తం చేసింది. మరోవైపు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చే సాహసం చేయవద్దని ముంబై పోలీసులు సూచిస్తున్నారు.


logo