సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 02:57:57

నీట మునిగిన ముంబై

నీట మునిగిన ముంబై

ముంబై, ఆగస్టు 4: భారీ వర్షాలు ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కురిసిన వానల వల్ల రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ముంబైపై వర్ష ప్రభావం అధికంగా పడింది. కొన్ని చోట్ల పట్టాలు నీటమునగడంతో అత్యవసర సేవలు అందించే రైళ్ల రాకపోకలు నిలచిపోయాయి. మరికొన్ని చోట్ల కరోనా రోగులకు చికిత్స అందించే దవాఖానల్లో పనిచేసే సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దవాఖానలకు వెళ్లడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. మరోవైపు భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో తల్లి, ఆమె పిల్లలు ఇద్దరు వరదలో కొట్టుకుపోయారు. ఈ ఘటన మంగళవారం సబర్బన్‌ శాంతాక్రుజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. అధికారులు మాట్లాడుతూ మురికి కాలువకు ఆనుకొని ఉన్న ఓ ఇల్లు కూలిపోవడంతో తల్లి, ముగ్గురు పిల్లలు అందులో పడి కొట్టుకుపోయారన్నారు. విషయం తెలియగానే రెండేండ్ల బాలికను కాపాడామని మిగిలిన ఇద్దరు పిల్లలు, తల్లి కోసం గాలిస్తున్నామని తెలిపారు.


logo