తమిళనాడుపై ‘నివర్’ పంజా

హైదరాబాద్: నివర్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరిపై పంజావిసిరింది. తుఫాను కారణంగా తమిళనాడులో ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయి. కడలూరు, రాణిపేట, పుదుచ్చేరి, చెన్నైలో భారీ వర్షాలు నమోదయ్యాయి. కడలూరులో గత 24 గంటల్లో 25 సెం.మీ., తామరపాక్కంలో 19 సెం.మీ., పళ్లిపట్టులో 17.5 సెం.మీ., చోళవరంలో 15.9, పూందమల్లిలో 15.4 సెం.మీ. వర్షపాతం నమోదయ్యాంది. అదేవిధంగా పుదుచ్చేరిలో 24 సెం.మీ. వాన కురిసింది. సీఎం నారాయణస్వామి ఇంటిని వర్షపునీరు ముంచెత్తింది. రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో విద్యా సంస్థలకు మూడురోజులపాటు సెలవు ప్రకటించింది.
నీటమునిగిన చెన్నై
తమిళనాడు రాజధాని చెన్నైని నివర్ తుఫాను ముంచెత్తింది. దీంతో నగరంలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ప్రధాన రహదారులపై పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. నగర శివారులోని ముడిచూర్ ప్రాంతంలోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో ఆ ప్రాంతంలో ఇళ్లన్నీ నీటమునిగాయి. ఉరపాక్కం చెరువు నిండటంతో పలు గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. అదేవిధంగా కేకే నగర్ ప్రాంతం జలదిగ్బంధమయ్యింది. చెంబరంబాక్కం డ్యాం పూర్తిగా నిండిపోయింది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడం గత ఐదేండ్లలో ఇదే మొదటిసారి. డ్యాం పూర్తిగా నిండటంతో 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. సైదాపేట, అడయార్‌లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రాయపేటలో చెట్టుకూలి ఓ వ్యక్తిపై పడటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. విల్లుపురం జిల్లాలో గోడకూలి మహిళ మృతిచెందింది.
చెరువులకు జలకళ.. పరీక్షలు వాయిదా
రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లోని చెరువులు పూర్తిగా జలకళ సంతరించుకున్నాయి. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో చెరువులు నిండిపోయాయి. భారీ వర్షాలతో ఇవాళ 16 జిల్లాల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏడు జిల్లాల్లో అన్ని రకాల ప్రజా రవాణాను నిలిపివేసింది. చెన్నై నుంచి వెళ్లాల్సిన రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇవాళ జరగాల్సిన సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. రేపు జరగనున్న టీఎన్పీఎస్సీ గ్రూప్-2 ఇంటర్వ్యూలను ప్రభుత్వం వాయిదావేసింది.
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం