బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 11:57:16

మద్యం మనుషులకు.. తిప్పలు చెప్పులకు

మద్యం మనుషులకు.. తిప్పలు చెప్పులకు

చెన్నై: తమిళనాడులో మద్యం దుకాణాల ముందు జనం బారులు తీరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజధాని చెన్నై మినహా మిగతా అన్ని జిల్లాల్లో మద్యం షాపులు మరోసారి ప్రారంభమయ్యాయి. దీంతో తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ (TASMAC) నిర్వహిస్తున్న మద్యం దుకాణాల ముందు జనం పెద్ద ఎత్తున పోగయ్యారు. అదేవిధంగా తిరుచిరాపల్లిలోని ఒక లిక్కర్‌ షాపు ముందు సైతం ఉదయం ఆరు గంటల నుంచే జనం క్యూకట్టారు. అయితే సమయం గడిచినా కొద్ది ఎండ తీవ్రత పెరిగి పోవడంతో మద్యం ప్రియులు పాదరక్షలకు పని కల్పించారు. పాదరక్షలను క్యూలైన్లలో పెట్టి వారు నీడకు నిలబడ్డారు. అంటే మద్యం మనుషులకైతే తిప్పలు చెప్పులకు వచ్చాయన్నమాట. 


వాస్తవానికి తమిళనాడులో మే 7వ తేదిన మద్యం దుకాణాలు తెరిచారు. అప్పుడు కూడా షాపుల ముందు రద్దీ ఎక్కువగా ఉండటంతో మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేసి, ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు చేపట్టాలని తీర్పు చెప్పింది. దీంతో రాష్ట్రంలో మద్యం దుకాణాలు మళ్లీ మూతపడ్డాయి. అయితే మద్రాస్‌ హైకోర్టు తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి తమిళనాడులో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కాగా, చెన్నై నగరం, రాష్ట్రంలోని అన్ని మాల్స్‌, కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతున్నది. 


logo