బుధవారం 08 జూలై 2020
National - Jun 04, 2020 , 22:37:47

హోటళ్లకు అన్‌లాక్‌-1 మార్గదర్శకాలు

 హోటళ్లకు అన్‌లాక్‌-1 మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్న నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్‌లాక్‌-1ను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగా ఎక్కువ సంఖ్యలో జనం గుమిగూడేందుకు అవకాశాలున్న విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మినహాయించి అన్నిరకాల వ్యాపారాలను చేసుకొనేందుకు అనుమతించారు. ఈ నెల 8వ తేదీ నుంచి కొన్ని నిబంధనలకు లోబడి హోటళ్లను నిర్వహించుకొనేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి: హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువ ప్రమాదం ఉన్న ఉద్యోగులు, వయసు మళ్లినవారు, గర్భం దాల్చినవారు పనిచేసేందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. హోటళ్లు, రెస్టారెంట్ల ప్రాంగణంలో, పార్కింగ్‌ స్థలాల్లో భౌతిక దూరం పాటించేలా చూడాలి. యాజమాన్యం, సిబ్బంది, సామగ్రి సరఫరాదారులు ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ద్వారాలు ఏర్పాటుచేయాలి. హోటల్‌కు వినియోగదారులు రాకుండా ఉండేందుకు కాంటాక్ట్‌లెస్‌ ఆర్డర్లను ప్రోత్సహించేలా చూడాలి. అతిథుల ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేయాలి. వారి గుర్తింపుకార్డులు తీసుకొని స్వీయప్రకటన పొందాలి. 

హాటళ్లకు వచ్చేవారి సామాన్లను గదులకు పంపే ముందుగా సామాన్లంటినీ విధిగా క్రిమిసంహారక మందుతో శుభ్రపరచాలి. అతిథులు, అంతర్గత సిబ్బంది మధ్య కమ్యూనికేషన్‌ జరిపేందుకు వీలుగా ఇంటర్‌కాం, మొబైల్‌ఫోన్లు అందుబాటులో ఉంచాలి. చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన గేమింగ్‌ జోన్లను తప్పనిసరిగా మూసివేయాలి. హోటళ్లు, రెస్టారెంట్లలోని ప్రస్తుతమున్న సీటింగ్‌ సామర్ధ్యాన్ని 50 శాతానికి తగ్గించాలి. పునర్‌వినియోగించని మెనూలు వాడాలి. గుడ్డ న్యాప్‌కీన్లకు బదులుగా పేపర్‌ న్యాప్‌కీన్లను వాడాలి. చివరగా కూర్చుని భోజనం చేయడానికి బదులుగా టేక్‌అవేను ప్రోత్సహించాలి. ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా శానిటైజర్లను ఏర్పాటుచేసి వచ్చే ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్నీనింగ్‌ చేయాలి. గది ఉష్ణోగ్రతలను 24-30 డిగ్రీల మధ్య ఉండేట్లుగా చూసుకోవాలి. అలాగే గాలిలో తేమ శాతాన్ని 40-70 వరకు ఉండేలా చూస్తూ బయటిగాలి ధారలంగా వీచేలా చర్యలు తీసుకోవాలి.


logo