బుధవారం 27 జనవరి 2021
National - Nov 25, 2020 , 15:17:19

హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంకు సరికొత్త మైలురాయి...

హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంకు సరికొత్త మైలురాయి...

ముంబై: హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంకు లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ మార్కు దాటిన భారత మూడో కంపెనీగా నిలవడం బ్యాంకింగ్ సంస్థల్లో ఇదే మొదటిది. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్లు, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాత రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ దాటిన కంపెనీగా రికార్డులకెక్కింది. ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్ డీఎఫ్ఎసీ స్టాక్ ధర నేడు రూ.1464 వద్ద గరిష్టాన్ని తాకింది.

ఉదయం మంచి లాభాల్లో ఉన్న స్టాక్, మధ్యాహ్నం సమయానికి నష్టాల్లోకి వెళ్లింది. మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా లాభాల నుంచి కిందకు పడిపోయాయి. హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంకు షేరు మంగళవారం రూ.1438 వద్ద క్లోజ్ అయింది. నేడు మరో రూ.26 ఎగిసింది. గం.11 నుంచి పతనం ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంకు స్టాక్ 0.61 శాతం క్షీణించి రూ.1,430 వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ రూ.1,464ను తాకిన సమయంలో హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.8 లక్షల కోట్లను దాటి రూ.8.02 లక్షల కోట్లుగా నమోదయింది.

ఈ ఏడాది హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంకు స్టాక్ దాదాపు 14 శాతం లాభపడింది. 2020 జనవరి 1న రూ.1,278గా ఉన్న స్టాక్ ఆ తర్వాత కరోనా నేపథ్యంలో మార్చి 23వ తేదీన రూ.771కు పతనమైంది. కరోనా కారణంగా మార్కెట్లు పతనమైన విషయం తెలిసిందే. అన్-లాక్ తర్వాత మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. నెల క్రితం కూడా రూ.1211 వద్ద ఉంది. గత ఐదు సెషన్లుగా స్టాక్ రూ.1369 నుంచి రూ.1460 మధ్య ట్రేడ్ అవుతున్నది. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.

ఏడాది ప్రాతిపదికన బ్యాంకు లాభాలు 18 శాతం ఎగిసి రూ.7,513 కోట్లుగా నమోదయ్యాయి. నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియే 1.08 శాతం ఉంది. హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంకు కంటే ముందు మొదట రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8 లక్షల కోట్లను దాటింది. ప్రస్తుతం భారత కంపెనీల్లోని మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ రూ.13.33 లక్షల కోట్లతో ముందు నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.10.22 లక్షల కోట్లుగా ఉన్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo