ఆదివారం 17 జనవరి 2021
National - Dec 03, 2020 , 15:55:08

పరీక్షల కోసం విద్యార్థిని జైలు నుంచి గెస్ట్‌హౌస్‌కు తరలించమన్న కోర్టు

పరీక్షల కోసం విద్యార్థిని జైలు నుంచి గెస్ట్‌హౌస్‌కు తరలించమన్న కోర్టు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభంలో ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో అరెస్టయిన జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాను అతిథిగృహానికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు గురువారం జైలు అధికారులను ఆదేశించింది. శుక్రవారం నుండి పరీక్షలు షెడ్యూల్ కావడంతో ఆసిఫ్‌ పరీక్షలు రాసేందుకు వీలుగా ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు సూచనలు చేసింది.  నిందితుడు తనతో పాటు స్టడీ మెటీరియల్ తీసుకెళ్లడానికి అనుమతించాలని, అవసరమైతే అతనికి ఏదైనా ఇతర బోధనా సామగ్రిని కూడా అందించాలని జైలు సూపరింటెండెంట్‌ను జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ కోరారు. డిసెంబర్ 4, 5, 7 తేదీల్లో జేఎంఐ విశ్వవిద్యాలయంలోని పరీక్షా కేంద్రానికి తన్హాను తీసుకెళ్లాలని, మూడు పరీక్షలు ముగిసిన తర్వాత తిరిగి జైలుకు తీసుకురావాలని కోర్టు తెలిపింది. గెస్ట్ హౌస్ లో ఉన్న సమయంలో తన్హా తన న్యాయవాదికి రోజుకు ఒకసారి ఫోన్ చేసేందుకు కోర్టు అనుమతించింది.

బీఏ పర్షియన్ (హానర్స్‌) సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావడానికి ట్రయల్ కోర్టు అతనికి డిసెంబర్ 4, 5, 7 తేదీల్లో మూడు రోజుల కస్టడీ పెరోల్  మంజూరు చేసింది. అయినప్పటికీ తన్హా సంతృప్తి చెందలేదు. మధ్యంతర బెయిల్‌ ఇవ్వకపోవడం వల్ల తనకు చదువుకునేందుకు అవసరమైన వాతావరణం లభించదని తన్హా చెప్పారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లు ముందస్తు కుట్రలో భాగమని ఆరోపిస్తూ మే 19 న ఆసిఫ్‌ ఇక్బాల్‌ తన్హాను పోలీసులు అరెస్టు చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.