గురువారం 09 జూలై 2020
National - Jun 22, 2020 , 19:55:57

ప్రైవేట్‌లో కొవిడ్‌ పరీక్షలు ఎందుకు చేయడం లేదు?

ప్రైవేట్‌లో కొవిడ్‌ పరీక్షలు ఎందుకు చేయడం లేదు?

న్యూ ఢిల్లీ: రాష్ట్రంలోని ప్రైవేట్‌ ల్యాబ్‌లు, దవాఖానల్లో కొవిడ్‌కు సంబంధించిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ఢిల్లీ సర్కారును ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. దేశ రాజధానిలోనే నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఎట్లా అని చీవాట్లు పెట్టింది. కనీసం సగం లక్ష్యం కూడా చేరుకోలేకపోయారని జస్టిస్‌ హిమా కొహ్లీ, జస్టిస్‌ ఎస్‌. ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.   

  కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించేందుకుగానూ ఇప్పటికే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ల్యాబ్‌లు, దవాఖానలను అనుమతించాలని కోరుతూ అడ్వొకేట్‌ రాకేశ్‌ మల్హోత్రా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ర్ట సర్కారు తరఫున హాజరైన అడ్వొకేట్‌ సత్యకాం తన వాదనలు వినిపించారు. రాష్ట్ర సర్కారు ఒక్కరోజులో 22,000 పరీక్షలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. జూన్‌ 21న కేవలం 9,356 పరీక్షలు మాత్రమే నిర్వహించినట్లు కోర్టుకు నివేదించారు. ప్రస్తుతం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఈ నెల 18 నుంచి ట్రయల్‌ బేసిస్‌లో కంటైనెమంట్‌ జోన్లలో మాత్రమే నిర్వహిస్తున్నామని సత్యకాం పేర్కొన్నారు. దీని ఆధారంగా వారం తర్వాత రాష్ట్ర సర్కారు భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తుందని వెల్లడించారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.logo