మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 20:48:29

కంగనా వ్యాఖ్యలపై దయ చూపితే బాగుండేది.. సంజయ్‌పై కోర్టు వ్యాఖ్య

కంగనా వ్యాఖ్యలపై దయ చూపితే బాగుండేది.. సంజయ్‌పై కోర్టు వ్యాఖ్య

ముంబై: నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ దయ చూపితే బాగుండేదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె ట్వీట్లపై స్పందించినప్పుడు నిగ్రహం వహించి ఉండాల్సిందని పేర్కొంది. ముంబైలోని కంగనా కార్యాలయం కూల్చివేత కేసుపై మంగళవారం విచారణ జరిపింది. ఈ కేసులో సంజయ్ రౌత్‌తోపాటు బీఎంసీ అధికారి భాగ్యవంత్‌ లేట్‌ను ప్రతివాదులుగా చేర్చడంతో వారి తరుఫు న్యాయవాదులు కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. పిటిషనర్ కంగనా ముంబైని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిందని, అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని సంజయ్ రౌత్ కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర, ముంబైను అవమానించిన కంగనాను ‘నిజాయితీ లేని’ వ్యక్తిగా మాత్రమే టీవీ ఇంటర్యూలో పేర్కొన్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ‘మీరు (సంజయ్ రౌత్) ఒక నేత, ఎంపీ. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. కంగనా చేసిన వ్యాఖ్యలను కోర్టు అంగీకరించడం లేదు. మనమంతా మహారాష్ట్రీయులం, దీనికి గర్వపడాలి. మనం దయ చూపాలి. ఇలాంటి విషయాలను వదిలివేయాలి. న్యాయం ఉన్నదా అన్ని ప్రశ్నించడం తగదు’ అని వ్యాఖ్యానించింది.

మరోవైపు బీఎంసీ అధికారి లేట్ ఆదేశాల ప్రకారం అధికారులు ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కంగనా కార్యాలయాన్ని సందర్శించారని, ఆమె సాయంత్రం 5 గంటలకు ట్వీట్లు చేసిందని ఆయన తరుఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీంతో ఆమె ట్వీట్ల వల్ల  కక్షతో ఆమె కార్యాలయం కూల్చివేత జరిగిందన్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కంగనా ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఆధారాలు చూపనందుకు ఆమె పిటిషన్‌ను తిరస్కరించాలని కోర్టును కోరారు. కంగనా తరుఫు న్యాయవాదుల వాదనలు కూడా విన్న బాంబే హైకోర్టు అందరినీ లిఖిత పూర్వకంగా తమ వాదనలను వారంలోగా సమర్పించాలని పేర్కొంది. కేసు విచారణను తదుపరి వారానికి  వాయిదా వేసింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo