ఆదివారం 24 జనవరి 2021
National - Nov 27, 2020 , 01:45:56

రణరంగం

రణరంగం

  • ‘చలో ఢిల్లీ’ యాత్రపై హర్యానా పోలీసుల ఉక్కుపాదం
  • బారికేడ్లను తోసుకుంటూ ముందుకొచ్చిన అన్నదాతలు
  • రైతన్నలపై జలఫిరంగులు, బాష్పవాయు గోళాల ప్రయోగం
  • పోలీసుల చర్యలను ఖండించిన పంజాబ్‌ సీఎం, అకాలీదళ్‌ నేతలు

అంబాలా (హర్యానా), నవంబర్‌ 26: దేశానికి అన్నంపెట్టే రైతన్నపై జలఫిరంగులు ఎగసిపడ్డాయి. ఊపిరి సలుపనివ్వకుండా బాష్ప వాయు గోళాలు విరుచుకుపడ్డాయి. అయినా అన్నదాతలు వెన్ను చూపలేదు. తమ ఉసురు తీసి, కార్పొరేట్‌ సంస్థలకు లాభంచేకూర్చేలా మోదీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కదంతొక్కారు. కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఢిల్లీ వైపునకు వెళ్తున్న పంజాబ్‌ రైతులను బీజేపీ పాలనలో ఉన్న హర్యానా పోలీసులు గురువారం సరిహద్దు ప్రాంతం షంభూ దగ్గర బారికేడ్లతో అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని లౌడ్‌ స్పీకర్లలో హెచ్చరించారు. రైతులు ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు. 

బారికేడ్లను తోసుకుంటూ కదం తొక్కారు. పోలీసుల తీరును నిరసిస్తూ కొందరు బారికేడ్లను ఘగ్గర్‌ నదిలో విసిరేశారు. దూసుకువస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు జలఫిరంగులను, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రైతులు, సాధారణ ప్రజలు నల్లరంగు జెండాలను ప్రదర్శిస్తూ, పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ట్రాక్టర్లు, లారీలలో వచ్చిన వేలాది మంది రైతులు ర్యాలీలో పాల్గొని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘శాంతియుతంగా తెలుపుతున్న తమ నిరసనలను హర్యానా పోలీసులు అణిచివేయడాన్ని ఖండిస్తున్నాం. నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును వాళ్లు కాలరాశారు’ అని ఓ పంజాబ్‌ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 


అష్టదిగ్బంధం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గురు, శుక్రవారాల్లో ‘చలో ఢిల్లీ’ ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునివ్వడంతో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. ర్యాలీగా వచ్చే పంజాబ్‌ రైతులను అడ్డుకోవడానికి రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. కీలక ప్రాంతాల్లో పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు, ‘చలో ఢిల్లీ’ నిరసనలకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో గురువారం రాజధాని ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. డ్రోన్‌లతో భద్రతను పర్యవేక్షించారు.

ఇది పంజాబ్‌ 26/11

‘చలో ఢిల్లీ’ని అడ్డుకున్న హర్యానా పోలీసులపై పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, రాజ్యంగ విరుద్ధమని అన్నారు. రైతులపై హర్యానా ప్రభుత్వం చేపట్టిన చర్యలను.. ‘పంజాబ్‌ 26/11’ దాడులుగా శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ అభివర్ణించారు. నవంబర్‌, 26, 2008లో ముంబైపై ఉగ్రవాదులు చేపట్టిన దాడులను పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను దేశానికి శత్రువులుగా భావిస్తున్నదని ఎస్‌ఏడీ మరోనేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తెలిపారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులను అడ్డుకోవడం తప్పుడు చర్య అని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. 

మోదీ సర్కార్‌ క్రూరమైన విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు దృఢంగా నిలబడ్డారని  కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల రూపంలో రైతులు చూపెడుతున్న తెగువను ఆయన ప్రశంసించారు. గడ్డకట్టే చలిలో నిరసనలు తెలుపుతున్న రైతులపై నీటి ఫిరంగులను ప్రయోగించడాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. రైతులపై పోలీసుల దాడులు తనను కలిచివేశాయని మాజీ ప్రధాని, జేడీయూ అధినేత హెచ్‌ డీ దేవెగౌడ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను గౌరవించాలని తెలిపారు.logo