సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 09:46:48

పటాకుల అమ్మకాలపై కొనసాగుతున్న బ్యాన్‌

పటాకుల అమ్మకాలపై కొనసాగుతున్న బ్యాన్‌

చండీగఢ్‌ : దీపావళి పండుగ వేళ దేశంలో పటాకుల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించే రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్‌, కర్ణాటక పలు రాష్ట్రాలు అమ్మకాలు, విక్రయాలపై బ్యాన్‌ విధించగా.. తాజాగా హర్యానా ప్రభుత్వం సైతం అమ్మకాలపై పూర్తిగా నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి, శీతాకాలం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బాణాసంచ పేల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, దీంతో కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విక్రయాలను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీల్లో ఈ నెల 7 నుంచి 30వ తేదీ వరకు నిషేధం కొనసాగుతుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. చలికాలం, కరోనా వైరస్‌ గాలి నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు నిషేధం విధించాయి.


మహారాష్ట్ర సర్కారు సైతం టపాసులకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అయితే అమ్మకాలు, వినియోగంపై మాత్రం నిషేధం విధించలేదు. పశ్చిమ బెంగాల్‌లో కాళీపూజ సందర్భంగా ఆ రాష్ట్ర టపాసులపై హైకోర్టు బ్యాన్‌ విధించింది. మరో వైపు బాణాసంచ కాల్చడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామి రాజస్థాన్‌, ఒడిశా సీఎంలకు లేఖ రాశారు. తమిళనాడులో బాణాసంచ ఉత్పత్తి ద్వారా ప్రత్యక్షంగా నాలుగు లక్షల మంది, పరోక్షంగా మరో నాలుగు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే బాణాసంచ ఉత్పత్తి చేస్తున్నారని, దీంతో కాలుష్య సమస్య ఏర్పడదన్నారు. ఈ మేరకు టపాసుల విక్రయాలు, వినియోగంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.