శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 10:23:59

స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్షల చరిత్ర?

స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్షల చరిత్ర?

తీహార్‌ జైల్లో నిర్భయ దోషులు నలుగురిని ఉరితీయగానే దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఆలస్యంగానైనా తమ బిడ్డకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. తీహార్‌ జైలు ముందు కూడా జనం పెద్ద ఎత్తున గుమిగూడి సంబరాలు చేసుకున్నారు. నిర్భయ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఎంతమందిని ఉరితీశారు? ఎలాంటి నేరచరిత్ర కలిగినవారు ఉరికంబం ఎక్కారు? అనే విషయాలను ఒక్కసారి పరిశీలిద్దాం..

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిర్భయ దోషులతో కలిపి దేశంలో మొత్తం 16 మందిని ఉరితీశారు. ఈ 16 మందిలో జాతిపిత గాంధీజీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హ్యత కేసులో దోషులతోపాటు అఫ్జల్‌గురు, అజ్మల్‌ కసబ్‌ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులూ ఉన్నారు. అయితే ఇంతమందిని ఉరికంబం ఎక్కించినా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయడం మాత్రం ఇండిపెండెంట్‌ ఇండియా చరిత్రలో ఇదే ప్రథమం. అయితే, దేశంలో మొట్టమొదట ఉరికంబం ఎక్కింది మాత్రం గాంధీజీ హత్య కేసులో దోషులైన నాథూరామ్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టే. 

 తీహార్‌ జైల్లో నిర్బయ దోషులకంటే ముందు చివరిసారిగా ఉగ్రవాది అఫ్జల్‌ గురును ఉరితీశారు. 2001లో పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్‌గురును 2013, ఫిబ్రవరి 9న ఉరికంబం ఎక్కించారు. అంతకుముందు 1989లో ఇందిరాగాంధీ హత్యకేసులో దోషులైన సత్వంత్‌ సింగ్‌, ఖేహార్‌ సింగ్‌లను తీహార్‌ జైల్లోనే ఉరితీశారు. దానికంటే ముందు రంగా, బిల్లాగా చలామణి అవుతూ ఎన్నో దారణాలకు పాల్పడ్డ పేరుమోసిన నేరగాళ్లు కుల్జీత్‌సింగ్‌, జస్బీర్‌సింగ్‌లను కూడా తీహార్‌ జైల్లోనే ఉరికంబం ఎక్కించారు. 1982, జనవరి 31న ఆ ఇద్దరికి ఉరిశిక్షలు అమలు చేశారు. 

ఇక, 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడైన యాకూబ్‌ మెమన్‌ను ముంబైలోని ఎరవాడ జైల్లో 2015, జూలై 30న ఉరితీశారు. 2012, నవంబర్‌ 21న పాకిస్థానీ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను కూడా ఎరవాడ జైల్లోనే ఉరితీశారు. 2008, నవంబర్‌ 26న మరో 9 మంది ఉగ్రవాదులతో కలిసి కసబ్‌ మారణహోమానికి పాల్పడ్డాడు. అయితే కమాండోల కాల్పుల్లో మిగతా ఉగ్రవాదులంతా మరణించగా కసబ్‌ ప్రాణాలతో పట్టుబడ్డాడు. అంతకుముందు 1992, అక్టోబర్‌ 9న కాంగ్రెస్‌ ఎంపీ లలిత్‌ మాకెన్‌ హత్య కేసులో దోషి అయిన హర్జిందర్‌సింగ్‌ జిందాను కూడా ఎరవాడ జైల్లోనే ఉరితీశారు. 

ఆ తర్వాత 2004, ఆగస్టు 14న ధనుంజయ చటర్జీ అనే రేపిస్టును ఉరికంబం ఎక్కించారు. 1990, మార్చి 5న 14 ఏండ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ధనుంజయను కోల్‌కతాలోని సెంట్రల్‌ జైల్లో ఉరితీశారు. ఆ తర్వాత చైన్నైలోని పెరియార్‌ నగర్‌లో వరుసగా ఆరుగురిని హత్య చేసిన సీరియల్‌ కిల్లర్‌ గౌరీ శంకర్‌ అలియాస్‌ ఆటో శంకర్‌ను 1995లో మద్రాస్‌ సెంట్రల్‌ జైల్లో ఉరికంబం ఎక్కించారు.        

 


logo