మాస్కో: సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్‌కు రష్యా ఆమోదం తెలిపింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ టీకా సామర్థ్యం 91.6 శాతం కాగా, సింగిల్ డోస్ టీకా సామర్థ్యం 79.4 శాతమని వ్యాక్సిన్ కోసం నిధులు సహాయం చేస్తున్న రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వరకు నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ అనంతరం 28 రోజుల తర్వాత సేకరించిన డేటా ఆధారంగా సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ సామర్థ్యాన్ని అంచనా వేసినట్లు వెల్లడించింది.
మరోవైపు రష్యా కరోనా టీకా స్పుత్నిక్ వీని 60కిపైగా దేశాలు ఆమోదించాయి. అయితే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మాత్రం ఇప్పటి వరకు దీనిని ఆమోదించలేదు. అలాగే రష్యా కరోనా టీకాపై కొన్ని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.