బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 18:10:56

బీజేపీకి వ్యతిరేకంగానే గుప్కార్‌ డిక్లరేషన్‌: ఫరూక్ అబ్దుల్లా

బీజేపీకి వ్యతిరేకంగానే గుప్కార్‌ డిక్లరేషన్‌: ఫరూక్ అబ్దుల్లా

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీలు చేసుకున్న గుప్కార్‌ డిక్లరేషన్‌ బీజేపీకి వ్యతిరేకమే తప్ప దేశానికి వ్యతిరేకంగా కాదని కొత్తగా ఏర్పడిన ప్రజా కూటమి అధ్యక్షుడు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు. ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేసిందని ఫరూక్‌ మండిప్డడారు. బీజేపీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదన్నారు. జమ్ముకశ్మీర్‌, లఢక్‌ ప్రజల హక్కుల పునరుద్ధరణే తమ లక్ష్యమని చెప్పారు. మతం పేరుతో తమను విభజించే ప్రయత్నాలు విఫలమవుతాయని అన్నారు. తమది మతపరమైన పోరాటం కాదన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ, రాష్ట్ర ఏకీకరణ కోసం ఈ ప్రాంత రాజకీయ పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చాయని చెప్పారు. 

గుప్కార్‌ డిక్లరేషన్ కోసం ఏర్పడిన పీపుల్స్ అలయన్స్ సభ్యుల సమావేశం పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ నివాసంలో శనివారం జరిగింది. ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాతోపాటు ఇతర పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా కూటమి అధ్యక్షుడిగా ఫరూక్‌ అబ్దుల్లాను, ఉపాధ్యక్షురాలిగా మెహబూబా ముఫ్తీని ఎన్నుకున్నట్లు జేకే పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత, కూటమి అధికార ప్రతినిధి సజ్జాద్ లోన్ తెలిపారు. గుప్కార్‌ డిక్లరేషన్‌కు సంబంధించిన పత్రం ఒక నెలలో తయారవుతుందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రచారం జరుగుతున్న అబద్ధాల వెనుక ఉన్న వాస్తవాలను అన్ని ఆధారాలతో వెల్లడిస్తామని అన్నారు. అపవాదు పడుతున్న జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ఇది నివాళి అని సజ్జాద్‌ లోన్‌ అభివర్ణించారు. విభజనకు ముందున్న జమ్ముకశ్మీర్‌ జెండా తమ కూటమి జెండా అని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.