శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 26, 2020 , 20:02:57

కార్గిల్ అమ‌ర‌వీరుల‌కు తొలి మహిళా ఐఎఎఫ్ పైలట్ నివాళి

కార్గిల్ అమ‌ర‌వీరుల‌కు తొలి మహిళా ఐఎఎఫ్ పైలట్ నివాళి

ఢిల్లీ : కార్గిల్ విజయ్ దివాస్‌ను పుర‌స్క‌రించుకుని భారతదేశపు తొలి మహిళా ఐఎఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా అమరవీరులకు నివాళులు అర్పించారు. పాకిస్తాన్ ద‌ళాల‌కు వ్య‌తిరేకంగా భార‌త సాయుధ ద‌ళాలు సాధించిన విజ‌యాన్ని పురస్క‌రించుకుని కార్గిల్ విజ‌య్ దివ‌స్‌గా జ‌రుపుకుంటున్నాం. పాక్ ఆక్ర‌మించుకున్న అన్ని స్థానాల‌ను భార‌త ద‌ళాలు తిరిగి విజ‌య‌వంతంగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ యుద్ధంలో ప్రాణాల‌ను అర్పించిన సాయుధ ద‌ళాల ధైర్య సాహ‌సాల‌కు గౌర‌వం, కృత‌జ్ఞ‌త‌లు చూపించ‌డానికి ప్ర‌తి ఏడాది దేశ‌వ్యాప్తంగా వార్షికోత్స‌వం జ‌రుపుకుంటున్నాం. కార్గిల్‌ పోరాటంలో పాల్గొన్న మొట్టమొదటి భారత మహిళా వైమానిక దళ పైలట్ గుంజన్ సక్సేనా. కార్గిల్ యుద్ధంలో తనతో కలిసి పోరాడి విధుల్లో అమరవీరులైన సైనికులకు ఆమె నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా సక్సేనా మాట్లాడుతూ... నేడు మ‌నం 21 వ కార్గిల్ దినోత్స‌వం జరుపుకుంటున్నాం అన్నారు. ఈ రోజు కార్గిల్ శిఖ‌రంపై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌రేసిన వారికి అంకితం చేయబడింద‌న్నారు. ధైర్య, స‌హ‌సాలు ప్ర‌ద‌ర్శించిన ఇటువంటి అమరవీరులను స్మ‌రిస్తూ వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. 

కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం, భారత సైన్యం ప్రపంచవ్యాప్తంగా విననిరీతిలో అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వర్తించాయ‌న్నారు. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటే నేటికి నా హృదయం గర్వంతో ఉప్పోంగిపోత‌ద‌న్నారు. ఐఏఎఫ్‌లో భాగ‌మై కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నందుకు గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. జై హింద్ అని ముగించారు. 

గుంజ‌న్ స‌క్సేనాపై డైరెక్ట‌ర్‌ శ‌ర‌ణ్ శ‌ర్మ తీసిన మూవీ ఈ ఏడాది చివ‌ర్లో విడుద‌ల కానుంది. మూవీ పేరు గుంజ‌న్ స‌క్సేనా- ది కార్గిల్ గ‌ర్ల్‌. నెట్‌ఫ్లిక్స్ స్ర్టీమింగ్‌లో విడుద‌ల కానుంది. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రంలో గుంజ‌న్ స‌క్సేనా పాత్ర‌లో జాన్వి కపూర్  న‌టించారు.


logo